పవన్‌ ‘గ్రీన్‌’ సిగ్నల్‌.. అన్నకు క్యాబినెట్‌ హోదా! | Pawan Kalyan's Brother Nagababu Appointed Green Executive Committee Chief | Sakshi
Sakshi News home page

పవన్‌ ‘గ్రీన్‌’ సిగ్నల్‌.. ఏడాదిన్నరలోపే అన్నకు క్యాబినెట్‌ హోదా!

Aug 17 2026 11:34 AM | Updated on Aug 17 2026 11:39 AM

Pawans Green Gift to Brother Nagababu: Gets Cabinet Rank

సాక్షి, విజయవాడ: ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జనసేన ఎమ్మెల్సీ, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సోదరుడు నాగబాబుకు కీలక పదవి దక్కింది. రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ పరిధిలోని గ్రీన్‌ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా నాగబాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవికి ఆయనకు క్యాబినెట్‌ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

నాగబాబు నియామకంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికై ఏడాదిన్నర కూడా పూర్తి కాలేదు. అయితే డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యవేక్షిస్తున్న పర్యావరణ, అటవీ శాఖ పరిధిలోనే ఆయన సోదరుడికి కీలక బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘‘అన్నకు తన సొంత శాఖలోనే కీలక పదవి’’ అంటూ అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం కనిపిస్తోంది.

గ్రీన్‌ మిషన్‌కు కమిటీ చైర్మన్‌
పర్యావరణ పరిరక్షణ, హరిత కార్యక్రమాల అమలు, రాష్ట్రంలో గ్రీన్‌ కవర్‌ పెంపు వంటి అంశాలపై ఈ కమిటీ పనిచేయనుంది. ఈ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆయనకు క్యాబినెట్‌ హోదా ఉండటంతో ప్రభుత్వ పరంగా ప్రత్యేక ప్రాధాన్యత లభించనుంది.

రాజకీయంగా ఆసక్తి..
జనసేనలో కీలకంగా వ్యవహరిస్తున్న నాగబాబు గతంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబును బతిమాలి.. అన్నకు ఎమ్మెల్సీగా అవకాశం ఇప్పించుకున్న పవన్‌ కల్యాణ్‌.. ఇప్పుడు మరో కీలక పదవి కట్టబెట్టారు. ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న నేతల కుటుంబ సభ్యులకు పదవులు దక్కడం ఎప్పుడూ రాజకీయ చర్చకు దారితీస్తుంటుంది. తాజాగా నాగబాబు నియామకం కూడా అలాంటి చర్చకే తెరలేపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement