రష్యాపై యూఎస్‌, యూకే సంచలన ఆరోపణలు

UK Says Russia Trying to Hack Covid 19 Vaccine Data - Sakshi

కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ డేటాను దొంగిలించేందుకు రష్యా ప్రయత్నిస్తోంది: యూకే

లండన్‌: మహమ్మారి కరోనాను అంతం చేసే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అమెరికా, బ్రిటన్‌, రష్యాలకు చెందిన పలు కంపెనీలు తీవ్రంగా శ్రమిస్తున్న విషయం తెలిసిందే. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ టీకా కూడా కీలకమైన మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు చేరుకోగా.. అమెరికన్‌ కంపెనీ మోడెర్నా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ మూడో దశ మానవ ప్రయోగాలు ఈ నెల 27న మొదలు కానున్నాయి. అయితే ప్రయోగాల దశల విషయంలో కొంత సందిగ్ధత ఉన్నప్పటికీ రష్యాలోని సెషనోవ్‌ యూనివర్సిటీ (రష్యా) టీకా ఆగస్టు రెండోవారానికల్లా అందుబాటులోకి రానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ప్రపంచలోనే తొలి కరోనా నిరోధక టీకా అందుబాటులోకి తెచ్చిన ఘనత రష్యా సొంతమవుతుంది.(భారత్‌కు ఆ సత్తా ఉంది: బిల్‌గేట్స్‌) 

ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్‌, కెనడా రష్యాపై గురువారం సంచలన ఆరోపణలు చేశాయి. కోవిడ్‌-19 వ్యాక్సిన్‌కు సంబంధించిన సమాచారాన్ని దొంగిలించేందుకు  రష్యా ప్రయత్నిస్తోందని మండిపడ్డాయి. రష్యా ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌లో భాగమైన ఏపీటీ29 లేదా కోజీ బేర్‌ అనే హ్యాకింగ్‌ గ్రూపు ఫార్మాసుటికల్‌ రీసెర్చ్‌ సంస్థల సమాచారన్ని హ్యాక్‌ చేసిందని ఆరోపణలు గుప్పించాయి. కరోనాకు విరుగుడు వ్యా​క్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న పరిశోధక సంస్థల కార్యకలాపాలపై దృష్టి సారించి.. పరిశోధనలకు భంగం కలగకుండా జాగ్రత్తపడుతూ మేథో సంపత్తిని దొంగిలిస్తోందని ఆరోపించాయి. ఈ మేరకు అమెరికా, కెనడా అధికారులతో సమన్వయం చేసుకున్న  బ్రిటన్‌ నేషనల్‌ సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ప్రకటన విడుదల చేసింది. అయితే వ్యాక్సిన్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం చోరీకి గురైందన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.(భారీ ముందడుగు : సెప్టెంబర్‌ నాటికి ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌!)

ఆరోపణలు ఖండించిన రష్యా
ఇక ఈ విషయంపై స్పందించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ రష్యా ఎన్నడూ అలాంటి ప్రయత్నాలు చేయదని స్పష్టం చేశారు. గ్రేట్‌ బ్రిటన్‌లోని కంపెనీల రీసెర్చ్‌ డేటా చోరీ విషయం గురించి తెలియదని, తమ దేశంపై వస్తున్న ఆరోపణలను ఖండించారు.కాగా 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు రష్యాపై ఇలాంటి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. రష్యా ప్రభుత్వంలో సంబంధాలు ఉన్నట్లుగా భావిస్తున్న కోజీ బేర్‌ అనే గ్రూప్‌ డెమొక్రటిక్‌ నేషనల్‌ కమిటీ కంప్యూటర్‌ను హ్యాక్‌ చేసి, ఇ-మెయిళ్లలో దాగున్న సమాచారాన్ని దొంగిలించిందనే ఆరోపణలు ఉన్నాయి. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top