అమెరికాలో మరింత తీవ్రం!

COVID-19: Global death toll surpasses 72636 - Sakshi

పది వేలు దాటిన మరణాలు

న్యూయార్క్‌లో నలుగురు భారతీయులు మృతి

స్పెయిన్, ఇటలీల్లో తగ్గిన మృతులు

లండన్‌/పారిస్‌/వాషింగ్టన్‌: కోవిడ్‌–19 మహమ్మారికి కళ్లెం పడుతోందా? చైనాలో పుట్టి ప్రపంచమంతా విస్తరించిన కరోనా వైరస్‌తో తీవ్రంగా నష్టపోయిన ఇటలీ, స్పెయిన్‌లలో కొన్ని రోజులుగా మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతూండటం ఈ ఆశను కల్పిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. పదివేలకుపైగా మరణాలు నమోదు కావడంతోపాటు మరో వారం పాటు మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించారు. కోవిడ్‌తో న్యూయార్క్‌లోనే 4,758 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా ఒక్క రోజులోనే 594 మంది మృతి చెందారు. నిత్యం రద్దీతో ఉండే టైమ్స్‌ స్క్వైర్‌ కూడా బోసిపోయింది. కోవిడ్‌తో న్యూయార్క్‌లో నలుగురు భారతీయులు చనిపోయారని మలయాళీల సంస్థ ఒకటి తెలిపింది.

ప్రపంచ వ్యాప్తంగా సోమవారం నాటికి కోవిడ్‌  72,636 మందిని బలి తీసుకోగా. 13 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌ ప్రభావం 191 దేశాల్లో కనిపిస్తున్నప్పటికీ యూరప్‌లోనే 50,215 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటలీలో సోమవారం నాటికి మరణాల సంఖ్య 16,523కు చేరుకుంది. దేశంలో 1.28 లక్షల మంది వ్యాధి బారిన పడ్డారు. స్పెయిన్‌లో 13,169 మంది ప్రాణాలు కోల్పోగా, 1.35 లక్షల మంది పాజిటివ్‌గా తేలారు.

ఫ్రాన్స్‌లో 8,911 మందిని కోవిడ్‌ బలితీసుకోగా, 92,839 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా 2.75 లక్షల మంది కోవిడ్‌ కోరల నుంచి తప్పించుకుని ఆరోగ్యవంతులు కావడం గమనార్హం. అమెరికాలో పదివేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. సుమారు 3.33 లక్షల మంది వ్యాధి బారిన పడ్డారు. బ్రిటన్‌లో వ్యాధి బారిన పడ్డ వారు 47 వేల పైచిలుకు మంది కాగా, 4834 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనా మొత్తమ్మీద 3,331 మంది కోవిడ్‌కు బలికాగా, మొత్తం 81,708 మందికి వైరస్‌ సోకింది.

నిలకడగా బ్రిటన్‌ ప్రధాని ఆరోగ్యం
కోవిడ్‌ బారిన పడిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని, కొన్ని పరీక్షల కోసం ఆయన ఒక రాత్రి ఆసుపత్రిలో గడపాల్సి వచ్చిందని ప్రభుత్వం తెలిపింది.  బ్రిటన్‌లో ఆదివారం నాటికి కోవిడ్‌ బాధితుల సంఖ్య 48 వేలకు చేరుకోగా 4,934 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఉండగా, బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ అరుదైన సందేశం ఇచ్చారు. బ్రిటన్, ఇతర కామన్వెల్త్‌ దేశాల ప్రజలు కలిసికట్టుగా, ఐకమత్యంతో కరోనా వైరస్‌ను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసులు13,12,494
మరణాలు72,636
కోలుకున్న వారు2,75,068

జపాన్‌లో అత్యవసర పరిస్థితి
టోక్యో: కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జపాన్‌లోని పలు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని జపాన్‌ ప్రధాని ప్రతిపాదించారు. ఆర్థిక వ్యవస్థపై కోవిడ్‌ ప్రభావాన్ని తగ్గించేందుకు లక్ష కోట్ల డాలర్లతో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని ప్రధాని షింజో అబే వెల్లడించారు. టోక్యో, ఒసాకా వంటి నగరాల్లో కరోనా వైరస్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయని అబే చెప్పారు. అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తే ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యేలా, వ్యాపారాలను మూసివేసేలా కోరేందుకు గవర్నర్లకు అధికారాలు లభిస్తాయి. అయితే ఇవన్నీ లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలతో పోలిస్తే ప్రభావం తక్కువ. ఒక నెల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అబే అన్నారు. జపాన్‌లో మొత్తం 3,650 మంది కరోనా వ్యాధి బారిన పడ్డారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top