ఆస్ట్రేలియా నేషనల్ వర్సిటీ అంచనా

Corona Virus: Millions Could Become Infected As china, UK, America Toll Passes - Sakshi

ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్శిటీ తాజా అధ్యయనం

చైనాతోపాటు ప్రపంచ దేశాలను భయకంపితుల్ని చేసిన కరోనా (కోవిడ్‌–19) వైరస్‌ వల్ల ప్రపంచానికి పెద్ద ప్రమాదమే పొంచి ఉందని ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్శిటీ  (ఏఎన్‌యూ) హెచ్చరిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ప్రపంచ దేశాలు మరింత సమన్వయంతో పనిచేయాల‍్సిన అవసరం ఉందని పేర్కొంది. భయానకంగా మారిన కరోనా వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా కనిష్టంగా 15 లక్షల మంది మృత్యువాత పడే ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్శిటీ నిర్వహించిన అధ్యయనం హెచ్చరించింది. పర్యవసానంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కనిష్టంగా లక్షల కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లుతుందని అధ్యయనంలో తేలినట్టు పేర్కొంది. కోవిడ్‌ వైరస్‌ బారిన పడిన ప్రతి దేశం తమ జీడీపీలో దాదాపు ఎనిమది శాతం నష్టపోతుందని హెచ్చరించింది. ఇప్పటికే అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాల స్టాక్‌ ఎక్స్ఛేంజీలు కుప్పకూలాయి. (50 బిలియన్ డాలర్ల ఎగుమతులకుకోవిడ్దెబ్బ! )

చైనా తర్వాత బ్రిటన్, అమెరికా దేశాల్లో కరోనా మృతుల సంఖ్య ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్శిటీ తరఫున అధ్యయనం జరిపిన వార్‌విక్‌ మ్యాక్‌కిబ్బన్, రోషన్‌ ఫెర్నాండో తెలిపారు. చైనాలో కరోనా వైరస్ బారిన పడిన వారిలో మడతి చెందిన వారి సంఖ్య 3.4 శాతం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. చైనాలో వుహాన్‌లో గత డిసెంబర్‌ 31వ తేదీన మొదటి వైరస్‌ కేసు నమోదైన విషయం తెల్సిందే. (హృదయాలను కదిలిస్తున్న ఫొటో)

చైనా, భారత్‌ దేశాల్లో ప్రజలు కోవిడ్‌ బారినపడి లక్షల్లో మరణిస్తారని, ఒక్క అమెరికాలోనే కనిష్టంగా 2.30 లక్షల మందికి పైగా మరణిస్తారని ఆ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అలాగే బ్రిటన్‌లో 64 వేల మంది, జర్మనీలో 79 వేల మంది, ఫ్రాన్స్‌లో 60 వేల మంది మరణించే అవకాశం ఉందని వారు తెలిపారు. ఇప్పటికే వైరస్‌ బాధితులు ఎక్కువగా ఉన్న దక్షిణ కొరియా, ఇటలీ దేశాల్లో కూడా మృతుల సంఖ్య లక్షల్లో ఉంటుందని వారంటున్నారు. పర్యవసానంగా బ్రిటన్‌ జీడీపీ 1.5 శాతం, అమెరికా జీడీపీ రెండు శాతం పడిపోతుందని, ఆస్ట్రేలియా, జర్మనీ దేశాల్లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడొచ్చని హెచ్చరించింది. అదే గరిష్టంగా నష్టాలను అంచనా వేసినట్లయితే ఒక్క చైనాలో అత్యధికంగా ఆ తర్వాత స్థానంలో అమెరికాలో లక్షల్లో మత్యువాత పడే ప్రమాదం ఉందని వారు తెలిపారు. బ్రిటన్‌లో 2,90 కోట్ల మంది, జర్మనీ, ఫ్రాన్స్‌ దేశాల్లో కూడా భారీ సంఖ్యలో మరణించే అవకాశం ఉందన్నారు. ఒకో పరిస్థితుల్లో ఒకో రకమైన నష్టం వాటిల్లగలదని యూనివర్సిటీ మూడు రకాల ప్రమాదాలను అంచనా వేసినట్టు నివేదిక తెలియజేసింది. (వేయి రోగాల పుట్టరా అరచేయి..)

క్యూఎస్‌ (క్వాకరెల్లీ సైమండ్స్‌) ప్రపంచ యూనివర్శిటీ ర్యాకింగ్‌ల ప్రకారం ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్శిటీ ఆస్ట్రేలియాలో మొదటి శ్రేణిలో ఉంది. 2017, 2018 సంవత్సరాల్లో ప్రపంచ టాప్‌ 20 ల్లో ఒకటి. 2019 సంవత్సరానికి 24 వ ర్యాంకు. టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకుల ప్రకారం ఈ యూనివర్శిటీకి ఆస్ట్రేలియాలో రెండో ర్యాంక్, ప్రపంచంలో 49వ ర్యాంక్‌. ముఖ్యంగా పరిశోధనాంశాల్లో ఈ యూనివర్శిటీకి మంచి పేరు ఉంది. ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్శిటీ తరఫున కరోనా వైరస్‌ ప్రభావంపై పరిశోధనలు జరిపిన వార్‌మక్‌ మ్యాక్‌కిబ్బిన్‌ అదే యూనివర్శిటీలోని ‘సెంటర్‌ ఫర్‌ మాక్రో ఎకనామిక్‌ అనాలసిస్‌’కు డైరెక్టర్‌గా పనిచేస్తుండగా, ఆయనకు పరిశోధనలో సహకరించిన రోషన్‌ ఫెర్నాండో అదే విభాగంలో  పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థి. (కోవిడ్కు కూడా ఎబోలా మందే!)  ఇలావుండగా, ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాలు చేపట్టిన నివారణ చర్యలు, వైరస్‌ వ్యాప్తి చెందకుండా కట్టడి చేసే చర్యల నేపథ్యంలో పెద్ద ప్రమాదమేమీ ఉండదని అనేక మంది నిపుణులు ఇప్పటికే చూసించిన విషయం తెలిసిందే. తాజాగా చెబుతున్న అస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ అధ్యయన నివేదిక కేవలం ఆయా గణాంకాల ఆధారంగానే ఊహాజనితంగానో ఉందని అనేక మంది కొట్టిపారేస్తున్నారు కూడా.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top