కరోనా ఫొటో: అతని జీవితం అస్తమించకూడదు

Corona Virus: Patient Enjoy Sunset With Doctor - Sakshi

ప్రపంచాన్ని కుదేలు చేస్తోన్న కోవిడ్‌-19(కరోనా వైరస్‌)ను నివారించేందుకు ప్రభుత్వాలు సాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు కరోనా బాధితులు, అనుమానితులను వైద్యబృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ఇక దాని బారిన పడ్డవారు మృత్యువు ఎటువైపు నుంచి తరుముకొస్తుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కాగా ఈ మహమ్మారి చైనాలోని వూహాన్‌లో బయటపడ్డ విషయం తెలిసిందే. తాజాగా అదే వూహాన్‌లో ఓ కరోనా బాధితుడు సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తున్న ఫొటో అందరి మనసులకు కదిలించివేస్తోంది. 87ఏళ్ల వృద్ధుడు కరోనా లక్షణాలతో గత నెల ఆసుపత్రిలో చేరాడు. పరీక్షలు నిర్వహించిన అనంతరం అతనికి పాజిటివ్‌ అని తేలడంతో అప్పటినుంచి హాస్పిటల్‌లోనే బందీగా మారిపోయాడు. అతన్ని పరీక్షించే వైద్యుడు రోగిని సిటీస్కాన్‌ కోసం తీసుకెళుతూ ఏదో తట్టినవాడిలా ఒక్కసారిగా ఆగిపోయాడు. (కరోనా జయించాలంటే ఇవి తినాలి)

రోగివైపు తిరిగి ‘సూర్యాస్తమయం చూస్తావా?’ అని అడిగాడు. వెంటనే అతను ఆనందంతో ‘తప్పకుండా చూస్తా’నని చెప్పడంతో.. నిర్మానుష్యంగా ఉన్న ఆసుపత్రి బయటకు తీసుకెళ్లాడు. నిర్మలంగా, వెలుగులు విరాజిమ్ముతూ అస్తమిస్తోన్న సూర్యుడిని, నిశ్శబ్ధంగా పలకరిస్తున్న ప్రకృతిని.. రోగి, అతన్ని కాపాడేందుకు విశ్వప్రయత్నం చేస్తున్న వైద్యుడు తనివితీరా ఆస్వాదించారు. దీనికి సంబంధించిన ఫొటోను ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. అతని జీవితం అస్తమించకూడదని, సూర్యోదయంలా మరింత ప్రకాశవంతంగా మారాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు. ‘అద్భుతమైన ఫొటో, అతను త్వరగా కోలుకోవాలి’ అని నెటిజన్లు మనసారా కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇప్పటివరకు 85 దేశాల్లో సంక్రమించిన ఈ వ్యాధి వల్ల 3345మంది మరణించారు. ఒక్క చైనాలోనే 80వేలకు పైగా కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.(ముందు జాగ్రత్తలతో కోవిడ్‌ కట్టడి!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top