కోవిడ్‌కు కూడా ఎబోలా మందే!

Hyderabad IICT Is Developing Drug For The Covid 19 Virus - Sakshi

చైనాలో గిలియడ్‌ ‘రెమిడిస్‌విర్‌’క్లినికల్‌ ట్రయల్స్‌ 

దేశీయ అవసరాల కోసం ‘ఏపీఐ’అభివృద్ధిలో ఐఐసీటీ 

ఔషధ తయారీ కోసం ముంబై ఫార్మా కంపెనీతో ఒప్పందం 

‘సాక్షి’తో ఐఐసీటీ డైరెక్టర్‌ శ్రీవారి చంద్రశేఖర్‌ 

సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌–19 వైరస్‌కు ఔషధాన్ని హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) అభివృద్ధి చేస్తోంది. దశాబ్దం కింద వచ్చిన ఎబోలా వైరస్‌ లక్షణాలే కోవిడ్‌లోనూ ఉన్నాయని.. అందుకే ఎబోలా యాంటీ వైరల్‌ డ్రగ్‌ రెమ్‌డెసివిర్‌ను రివర్స్‌ ఇంజనీరింగ్‌ పద్ధతిలో యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇంగ్రీడియెంట్స్‌ (ఏపీఐ) అభివృద్ధి చేస్తున్నామని ఐఐసీటీ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీవారి చంద్రశేఖర్‌ ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’తో చెప్పారు. ఇప్పటికే ప్రపంచ ఫార్మా దిగ్గజం, రెమిడిస్‌విర్‌ను అభివృద్ధి చేసిన గిలియడ్‌ సైన్సెస్‌ కంపెనీ.. అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) అనుమతితో చైనా, దక్షిణ కొరియా దేశాల్లో కోవిడ్‌ సోకిన వారిపై ఫేజ్‌–3 క్లినికల్‌ ట్రయల్స్‌ చేసింది. ఇది విజయవంతమైతే మన దేశీయ అవసరాల కోసం ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా మనమే ఔషధాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని పేర్కొన్నారు. 

2 నెలల్లో ఏపీఐ తయారీ.. 
‘ఏపీఐ అభివృద్ధి కోసం అవసరమైన రైబోస్, పిర్రోల్, అలనీన్, కార్బోహైడ్రేట్స్‌–5 వంటి ముడి పదార్థాలను పెద్ద ఎత్తున సమీకరించాం. తొలుత శాంపిల్‌ ఏపీఐ కోసం 50 గ్రాములను తయారు చేస్తున్నాం. 15 మంది శాస్త్రవేత్తలు 2 విడతలుగా అభివృద్ధి పనిలో నిమగ్నమయ్యారు. 2 నెలల్లో పూర్తి స్థాయి ఏపీఐ సిద్ధమవుతుంది’అని చంద్రశేఖర్‌ తెలిపారు. 

ముంబై ఫార్మాతో ఒప్పందం.. 
‘ఐఐసీటీలోని 3 స్టార్టప్‌ కంపెనీలు ఏపీఐకి అవసరమైన సాంకేతిక అభివృద్ధిలో సాయం చేస్తున్నాయి. ఏపీఐ తయారీ పూర్తయి, దేశీయ అవసరాల కోసం ఔషధ తయారీ అవసరమని కేంద్రం భావిస్తే.. బల్క్‌లో తయారు చేసేందుకు ముంబైకు చెందిన ఫార్మా కంపెనీతో ఒప్పందం చేసుకున్నాం. స్థానిక మార్కెట్‌ కోసం ఔషధ తయారీకి హైదరాబాద్‌కు చెందిన రెండు, మూడు ఫార్మా కంపెనీలకు ఏపీఐలను అందిస్తాం’అని వివరించారు. 

రోగ నిరోధక శక్తి పెంచుకుంటే చాలు.. 
ఎక్కువ ఉష్ణోగ్రతలో వైరస్‌ తన రూపాన్ని, నిర్మాణాన్ని మార్చుకుంటుంది. ఇప్పుడు సాంకేతికత, అవగాహన పెరిగింది కాబట్టి వైరస్‌ను సమర్థంగా నివారించొచ్చు. వైరస్‌ సోకాలంటే ఏదైనా పరాన్నజీవి కావాలి. కోవిడ్‌ను తట్టుకునే రోగనిరోధక శక్తి మన శరీరానికి ఉంటుంది. దాన్ని బలోపేతం చేస్తే చాలు. ఆస్తమా, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధి ఉన్నవారికి సంక్రమించే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అందరూ 2–3 నెలలు ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top