తరగతిలో ఫ్యాన్‌కు టీచర్‌ మృతదేహం | Telugu Teacher Commits Suicide in Class Room Tamil nadu | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో తెలుగు టీచర్‌ మృతి

Dec 19 2019 8:35 AM | Updated on Dec 19 2019 8:41 AM

Telugu Teacher Commits Suicide in Class Room Tamil nadu - Sakshi

మృతి చెందిన హరి శాంతి (ఫైల్‌), పనిచేస్తున్న కాలేజీ

చేతి మణికట్టుకు గాటు ‘నటరాజ్‌’తో పరిచయంపై ఆరా

సాక్షి, చెన్నై: ప్రైవేటు కళాశాల తరగతి గదిలో తెలుగు టీచర్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం బుధవారం కలకలం రేపింది. ఆమె చేతి మణికట్టు భాగంలో కత్తి గాటు ఉండడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కారంబాక్కం తాలుకా ఎల్లయమ్మన్‌ ఆలయం వీధికి చెందిన హరి శాంతి(32) మద్రాసు వర్సిటీ తెలుగు విభాగంలో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తి చేశారు. పేద తెలుగు కుటుంబం నుంచి చెన్నైకు వచ్చిన ఆమె  స్థానికంగా ఖాళీ సమయాల్లో  చిన్నాచితక పనులు కూడా చేసుకుంటూ చదువును కొనసాగించారు. అలాగే పూందమల్లి హైరోడ్డులోని డీజీ వైష్ణవ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా కొంత కాలం పని చేశారు. ప్రస్తుతం పెరంబూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు టీచర్‌గా పనిచేస్తున్నారు.  ఈ పరిస్థితుల్లో బుధవారం ఉదయం డీజీ వైష్ణవ కళాశాల తెలుగు విభాగం తరగతి గదిలో ఆమె మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడం చర్చనీయాంశం అయింది.

అనుమానాస్పదం..
డీజీ వైష్ణవ కళాశాల నుంచి ఐదేళ్ల క్రితం ఆమె బయటకు వచ్చేశారు. అయినా తరచూ ఆ కళాశాలకు వెళ్తూ రావడంతో సెక్యూరిటీ సిబ్బందికి సుపరిచితురాలిగా మారారు. మంగళవారం కళాశాలకు వెళ్లిన హరిశాంతి తిరిగి బయటకు రాలేదు. బుధవారం ఉదయం కళాశాల మొదటి అంతస్తులోని తెలుగు విభాగం తరగతి గదిలో ఫ్యానుకు వేలాడుతూ కనిపించడంతో పారిశుద్ధ్య సిబ్బంది సెక్యూరిటీకి సమాచారం ఇచ్చారు. అరుంబాక్కం పోలీసులకు తెలపడంతో పులియాంతోపు డిప్యూటీ కమిషనర్‌ రాజేష్‌ ఖన్నా, అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాసులు, అరుంబాక్కం ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. మృతదేహాన్ని కిందకు దించి పరిశీలించగా ఆమె ఎడమ చేతి మణికట్టుకు కత్తి, బ్లేడుతో కోసినట్టుగా గాటు కనిపించింది. దీంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్థానికంగా ఉన్న తెలుగు వారు విచారం వ్యక్తం చేశారు. మద్రాసు వర్సిటీలో చదువుకుంటున్న సమయంలో, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా, టీచర్‌గా చేస్తున్న కాలంలో అనేక వేదికలపై హరి శాంతి కనిపించే వారు కావడంతో  ఎక్కువ మంది తెలుగు వారికి ఆమె సుపరిచితురాలు. అదే సమయంలో ఆత్మహత్య చేసుకునేంత పిరికిది హరి శాంతి కాదని పలువురు సన్నిహితులు పేర్కొంటున్నారు.

నటరాజ్‌తో పరిచయంపై ఆరా.....
డీజీ వైష్ణవ కళాశాల నుంచి బయటకు వచ్చి టీచర్‌గా పనిచేస్తున్నా, తాను గతంలో పనిచేసిన కళాశాలకు పదే పదే హరిశాంతి వచ్చి వెళ్తుండడం ఆలోచించ దగ్గ విషయం. ఇక్కడ పనిచేస్తున్న నటరాజ్‌ అనే ప్రొఫెసర్‌తో ఆమెకు ఉన్న పరిచయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మంగళవారం కూడా ఆమె నటరాజ్‌ను కలవడానికే వచ్చినా, తిరిగి వెళ్లక పోవడం అనుమానాలకు దారి తీస్తున్నాయి. లోనికి వచ్చిన వ్యక్తి బయటకు వెళ్లారా..? లేదా అని తెలుసుకోని  అక్కడి సెక్యూరిటీ సిబ్బంది వైఫల్యం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుండడంతో పోలీసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తరగతి గది సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కీల్పాకం ఆస్పత్రికి తరలించారు. తమ కుమార్తె మరణ సమాచారాన్ని అందుకున్న కుటుంబీకులు చెన్నైకు చేరుకుని కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement