‘ఉపాధి’ రాజకీయం

Upadi Hami Pathakam In Politics TDP Leaders Kurnool - Sakshi

కోవెలకుంట్ల (కర్నూలు): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రాజకీయం చోటు చేసుకుంటోంది. వైఎస్‌ఆర్‌సీపీ సానుభూతి పరులంటూ టార్గెట్‌ చేసి మరీ ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగిస్తున్నారు. జిల్లాలో 889 గ్రామ పంచాయతీలు ఉండగా..  ఉపాధి హామీ పథకం కింద   ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సీనియర్,  జూనియర్‌ మేటీలు గ్రామానికి ఒకరు చొప్పున పనిచేస్తున్నారు.  ఏడాదిలో 7,500 పనిదినాలు కల్పించలేదన్న నెపంతో ఇటీవల సుమారు వంద మందినితొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఫీల్డ్‌ అసిస్టెంట్లపై కక్ష సాధింపు 
ఉపాధి హామీ పథకం కింద గత ఏడాది జూలై 1వ తేదీ నుంచి ఈ ఏడాది జూన్‌ ఆఖరు వరకు గ్రామాల్లో కూలీలకు పనులు కల్పించేందుకు ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సీనియర్‌ మేటీలకు 7,500 పనిదినాల చొప్పున, జూనియర్‌ మేటీలకు 5వేల పనిదినాల చొప్పున కేటాయించారు. పదిదినాలతో పాటు కూలీలకు రోజుకు రూ.205 వేతనం పడాలన్న నిబంధన విధించారు. ఈ క్రమంలో లక్ష్యాన్ని చేరుకోలేని ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సీనియర్‌ మేటీలపై వేటు పడగా.. మరి కొన్ని గ్రామాల్లో ఫీల్ట్‌ అసిస్టెంట్లు లక్ష్యాన్ని అధిగమించినప్పటికీ ఇతర కారణాలు చూపి తొలగించినట్లు తెలుస్తోంది. గ్రామాల్లో టీడీపీ నాయకులకు అనుకూలంగా లేని వారిని అధికారులు బలిపశువులు చేసినట్లు  ఆరోపణలున్నాయి.

అనుకూలంగా ఉన్నవారు కొనసాగింపు 
లక్ష్యాన్ని చేరుకోలేదన్న సాకుతో ఫీల్ట్‌ అసిస్టెంట్లు, సీనియర్‌ మేటీలను తొలగించిన అధికారులు గ్రామాల్లో టీడీపీ నాయకులకు అనుకూలంగా ఉన్న సిబ్బందిని మాత్రం తిరిగి కొనసాగిస్తున్నారు. వారికి అనుకూలంగా లేనివారిని మాత్రం వైఎస్‌ఆర్‌సీపీ సానుభూతి పరులుగా ముద్ర చేసి తొలగించారు.  కోవెలకుంట్ల మండలంలోని పెద్దకొప్పెర్ల, వెలగటూరు, బిజనవేముల, సంజామ ల మండలం ఎగ్గోని, కొలిమిగుండ్ల మండలం నందిపాడు, బందార్లపల్లె, బెలూం గ్రామాల్లోని సీనియర్‌ మేటీలు 7,500 పనిదినాల కంటే తక్కువ కల్పించడంతో వారిని తొలగించారు. అయితే.. వీరి స్థానాల్లో ఇతరులను నియమించకుండా తిరిగి వారినే కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నాయకులకు అనుకూలంగా లేని సిబ్బందికి మాత్రం ఇలాంటి అవకాశం ఇవ్వడం లేదు. 

లక్ష్యాన్ని చేరుకోకపోయినా కొనసాగింపు 
కోవెలకుంట్ల మండలంలోని వెలగటూరు, బిజనవేముల, పెద్దకొప్పెర్ల గ్రామాల్లో సీనియర్‌ మేటీలుగా పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. నిబంధనల ప్రకారం వీరిపై వేటు పడింది. అయితే.. వీరిని జూనియర్‌ మేటీలుగా పరిగణించేందుకు తిరిగి పథకంలో కొనసాగిస్తున్నారు.  

వైఎస్‌ఆర్‌సీపీ సానూభూతి పరుడినని..
 పదేళ్ల పాటు ఉపాధి పథకంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పనిచేశా. వైఎస్‌ఆర్‌సీపీ సానుభూతి పరుడినని ఏడాది క్రితం అన్యాయంగా తొలగించారు. గ్రామంలో 3,700 పనిదినాలు కల్పించాలని టార్గెట్‌ ఇవ్వగా నేను 6,300 కల్పించాను. అయినప్పటికీ కూలీలకు 7,500 పనిదినాలు కల్పించలేదన్న సాకుతో తొలగించారు. టీడీపీకి అనుకూలంగా లేని ఫీల్డ్‌ అసిస్టెంట్లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉద్యోగాలు తొలగిస్తున్నారు.  
–గోవిందరెడ్డి, గుంజలపాడు, కోవెలకుంట్ల మండలం 

న్యాయపోరాటం చేస్తాం
గ్రామాల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతి పరులను టార్గెట్‌ చేస్తున్నారు. ఉపాధి పథకం ఫీల్ట్‌ అసిస్టెంట్లుగా ఉన్నవారిని అన్యాయంగా తొలగిస్తున్నారు. ఫీల్ట్‌అసిస్టెంట్ల పనితీరు బాగుందని, ఉపాధి పథకం కింద పనులు కల్పిస్తున్నారని ఆయా గ్రామాల కూలీలు చెబుతున్నా..   టీడీపీ నాయకులు మాత్రం ఓ పథకం ప్రకారం తొలగింపజేస్తున్నారు. ఆ పార్టీ కార్యకర్తలకు పోస్టులు కట్టబడితే మస్టర్లలో బినామీ పేర్లు చేర్చి దోచుకోవచ్చనే ఆలోచనతో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. అన్యాయంగా తొలగించిన ఫీల్డ్‌ అసిస్టెంట్ల తరఫున కోర్టుకెళ్లి న్యాయ పోరాటం చేస్తాం.  – కాటసాని రామిరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ 
బనగానపల్లె నియోజకవర్గ సమన్వయకర్త 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top