స్థానిక సీతారామపురం వద్ద జాతీయ రహదారి జంక్షన్లో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మరణం
Feb 7 2014 1:03 AM | Updated on Aug 30 2018 3:56 PM
తుని, న్యూస్‌లైన్ :స్థానిక సీతారామపురం వద్ద జాతీయ రహదారి జంక్షన్లో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. పట్టణ పోలీసుల కథనం ప్రకారం ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తుని పట్టణం కొండవారిపేటకు చెందిన పాస్టర్ దండా లాజరు (36), విశాఖజిల్లా పాయకరావుపేట ఇందిరా కాలనీకి చెందిన గారా సింహాచలం (40) సైకిల్‌పై తుని ఒకటో వార్డులోని నెహ్రూనగర్ వెళ్లేందుకు జాతీయ రహదారి దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. సింహాచలం సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన లాజర్‌ను 108 అంబులెన్స్‌లో తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అతడ్ని వైద్యుల సలహాపై కాకినాడ తరలిస్తుండగా దారిలో మృతి చెందాడు. సింహాచలం రిక్షా కార్మికుడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నెహ్రూ నగర్‌లో ప్రార్థనాలయానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
Advertisement


