రెండుగా విశాఖ ఏపీఐఐసీ జోన్ | Two APIIC zone in Visakhapatnam | Sakshi
Sakshi News home page

రెండుగా విశాఖ ఏపీఐఐసీ జోన్

Nov 5 2015 9:47 AM | Updated on Mar 28 2019 5:34 PM

విశాఖ కేంద్రంలో ఉండే ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ)ని ఇప్పుడు రెండు జోన్లుగా చేయడానికి ఆ సంస్థ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

విశాఖ కేంద్రంలో ఉండే ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ)ని ఇప్పుడు రెండు జోన్లుగా చేయడానికి ఆ సంస్థ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఏడు జోన్లు ఉన్నాయి. విశాఖలో రెగ్యులర్, స్పెషల్‌తో పాటు విజయవాడ, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం జోన్లు ఉన్నాయి. ఒక్కో జోన్ కింద రెండు జిల్లాలు ఉండేవి.

 అయితే పాలనా సౌలభ్యం కోసం తాజాగా నెల్లూరు జోన్‌లో ఉండే ప్రకాశం జిల్లాను వేరు చేసి ఒంగోలు కేంద్రంగా జోన్ ఏర్పాటు చేశారు. అలాగే అనంతపురం జోన్‌లో ఉండే కర్నూలును వేరు చేసి కొత్త జోన్ ఇచ్చారు. వాటి మాదిరిగా విశాఖ జోన్‌లో ఉండే మూడు జిల్లాలను ఇప్పుడు రెండుగా చేయడానికి ఆలోచన చేస్తున్నారు. విశాఖ స్పెషల్ జోన్‌గా జిల్లాలో పరిశ్రమలు చూసేందుకు ప్రత్యేకంగా ఒక జోన్‌ను ఏర్పాటు చేసుకుని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను కలిపి ఒక జోన్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నారు.

 ప్రస్తుతం విశాఖ జోన్ పరిధిలోని మూడు జిల్లాల్లోనూ 31 ఎస్టేట్‌లున్నాయి. వీటి పరిధిలో సుమారు 27 వేల ఎకరాల భూమి ఉంది. విశాఖ స్పెషల్ ఎస్‌ఈజెడ్(ప్రత్యేక ఆర్థిక మండలి) పరిధిలో 11,500 ఎకరాల్లో పరిశ్రమలున్నాయి. అలాగే విశాఖ జిల్లాలో 12 ఎస్టేట్లలో 518 ప్లాట్లలో పరిశ్రమలున్నాయి.
 
 రెండు జిల్లాల్లో పది ఎస్టేట్‌లు
 ఇక విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పది ఎస్టేట్‌లున్నాయి. వాటి లో అధిక విస్తీర్ణంలో ప్లాట్లు ఉన్నది బొబ్బిలి గ్రోత్‌సెంటరులోనే. విజయనగరం జిల్లాలోని విజయనగరంలో 49 ప్లాట్లు, నెల్లిమర్లలో 83 ప్లాట్లు, కంటకాపల్లిలో ఏడు ప్లాట్లు, బొబ్బిలిలో 515 ప్లాట్లతో పారిశ్రామికవాడలున్నాయి. అలాగే శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 55 ప్లాట్లు, పైడి భీమవరంలో 61 ప్లాట్లు, పలాసలో 111 ప్లాట్లు, శ్రీకాకుళంలో 56, బలగలో 7, సంతబొమ్మాళిలో 3 ప్లాట్లు ఉన్నాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement