ఖాకీ.. దొంగల్లో కలవరం | The complaint against police | Sakshi
Sakshi News home page

ఖాకీ.. దొంగల్లో కలవరం

Aug 22 2015 2:50 AM | Updated on Aug 21 2018 5:51 PM

ఖాకీ.. దొంగల్లో కలవరం - Sakshi

ఖాకీ.. దొంగల్లో కలవరం

స్మగ్లర్లకు చుట్టాలుగా మారి చట్టాలకు తిలోదకాలిచ్చిన జిల్లా ఖాకీల్లో ఇప్పుడు కలవరం మొదలైంది.

పోలీసులపై ఫిర్యాదుకు      వెనుకాడని స్మగ్లర్లు
వడ మాలపేట ఉదంతంతో  వణుకుతున్న పోలీసులు

 
 స్మగ్లర్లకు చుట్టాలుగా మారి చట్టాలకు తిలోదకాలిచ్చిన జిల్లా ఖాకీల్లో ఇప్పుడు కలవరం మొదలైంది. ఇన్నాళ్లూ ఎర్ర దొంగల పేరుతో లక్షలు సంపాదించిన వారంతా తమ పేరెక్కడ బయటపడతుందోనని లోలోన వణికిపోతున్నారు. ఇన్నాళ్లూ తమకు ముచ్చెమటలు పట్టించిన పోలీసుల కక్కూర్తిని బయట పెట్టేందుకు స్మగ్లర్లు ధైర్యంగా ముందుకొస్తుండడమే.. దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
 
 తిరుపతి సిటీ/తిరుపతి క్రైం: వడమాలపేట పోలీసుల ఉదంతం జిల్లా పోలీసు యంత్రాంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి డబ్బు వసూలు చేసి అడ్డంగా దొరికిన వడమాలపేట ఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఇంటెలిజెన్స్‌కు బుక్కైపోయారు. ఈ నేపథ్యంలో ఎర్రదొంగల నుంచి ఆ మ్యామ్యాలు స్వీకరించిన పోలీసులకు ముచ్చెమటలు పడుతున్నాయి. స్మగ్లర్లను గతంలో వేధింపులకు గురిచేసిన పలువురు పోలీస్ ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు  తీవ్ర భయాందోళనలతో వణికిపోతున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లను, కూలీలను అరెస్ట్ చేయాడానికి రాయలసీమ పరిధిలో పోలీస్ టాస్క్‌ఫోర్సు బృందాలను ప్రత్యేకంగా నియమించారు. ఇదే అదునుగా భావించిన లా అండ్ ఆర్డర్ పోలీసులు గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న వారి వివరాలను ఆరా తీస్తూ వారిని అనధికారికంగా స్టేషన్లకు  పిలిపించి లక్షలాది రూపాయలు దండుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 విచారణ పేరుతో.. దోపిడీ
 స్మగ్లర్లకు చెందిన వాహనాలు, విలువైన వస్తువులను పోలీసులు విచారణ పేరుతో తీసుకుని వెనక్కి ఇవ్వన్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాతో పాటు తిరుపతి అర్బన్ జిల్లాలో ఏర్పడిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు... ఎర్రస్మగ్లర్ల పేరుతో కొంతమందిని విచారణకు తీసుకొచ్చి వారి వద్ద లక్షల రూపాయలు తీసుకున్నారనే ఆరోపణలు ఇప్పుడు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. అయితే ఎర్రచందనం స్మగ్లర్లు బయటకు చెప్పుకోలేక, ఏవరికైనా ఫిర్యాదు చేస్తే మరింతగా వేధింపులు ఉంటాయని లోలోలపలే కుమిలిపోయేవారు. అయితే ఇప్పుడు కొందరు ధైర్యం చేసి పోలీసుపైనే ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమౌతున్నారు.

 ఇంకా ఎంతమంది పోలీసులున్నారో..
 ఎర్రచందనం స్మగ్లర్ ఫిర్యాదు మేరకు రేణిగుంట పోలీసులు వడమాల పేట ఎస్‌ఐతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసులు నమోదు అయ్యింది. దీంతో ఈ లెక్కన స్మగ్లర్లను డ బ్బు వేధింపులకు గురిచేస్తున్న పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు ఎందరున్నారో ఇకపై వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కడప, చిత్తూరు జిల్లాల్లో పనిచేసే 134 మంది పోలీసులకు, అధికారులకు ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారాల్లో ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయాలు ఉన్నట్లు అప్పట్లోనే టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించి నివేదికలు తయారు చేశారు. ఈ వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్ ఓఎస్‌డీగా పనిచేసిన అధికారిని 2014లో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అంతేకాకుండా కార్వేటినగరం సర్కిల్ పరిధిలో ఒక హత్యకేసులో భారీగా ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలతో సీఐతోపాటు ఎస్‌ఐను సస్పెండ్ చేశారు.

ఇటివల ఎస్వీయూ పోలీస్ స్టేషన్‌లో అనధికారికంగా హైదరాబాదుకు చెందిన వ్యక్తిని ఒక ఎస్‌ఐ, బ్లూకోల్ట్ కానిస్టేబుల్ రెండు రోజుల పాటు విచారణ పేరుతో నిర్బధించారనే ఆరోపణలు వెలుగు చేశాయి. పైగా బాధితుడి నుంచి కారు, బంగారు ఉంగారాన్ని స్వాధీనం చేసుకుని వదలిపెట్టినట్లు సమాచారం. ఆ కేసులో బాధితుడు అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్పెషల్‌బ్రాంచి డీఎస్పీ విచారణ చేపట్టినట్లు సమాచారం. పోలీస్ శాఖలో అనేకమంది స్మగ్లర్లతో చేతులు కలిపి లక్షలాది రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా పోలీసుల వేధింపులకు గురై లక్షలాది రూపాయలు పోగొట్టుకున్న ఎర్ర స్మగ్లర్లకు వడమాలపేట ఉదంతం చెప్పలేనంత గుండె ధైర్యాన్ని ఇస్తుందని పోలీసు శాఖలోని కొందరు అధికారులే చెబుతుండడం గమనార్హం.
 

Advertisement
 
Advertisement
Advertisement