సిగ్గు.. సిగ్గు | .. Shame shame | Sakshi
Sakshi News home page

సిగ్గు.. సిగ్గు

Dec 6 2014 2:50 AM | Updated on May 29 2018 2:59 PM

సిగ్గు.. సిగ్గు - Sakshi

సిగ్గు.. సిగ్గు

రోజుకో మాట చెబుతూ, తన కంటే ఎక్కువ రంగులు మారుస్తున్న సీఎం చంద్రబాబును చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలక మండలి (సీజీసీ) సభ్యులు, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు.

సాక్షి ప్రతినిధి, కర్నూలు :  రోజుకో మాట చెబుతూ, తన కంటే ఎక్కువ రంగులు మారుస్తున్న సీఎం చంద్రబాబును చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలక మండలి (సీజీసీ) సభ్యులు, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం కర్నూలులోని కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మహా ధర్నాలో ఆయన మాట్లాడారు.
 
  రుణ మాఫీ ప్రకటనపై అధికార పార్టీ నాయకులు స్వీట్లు పంచుకుంటున్న ఫొటోలను చూసి తమకే అసహ్యం వేస్తోందన్నారు. కర్నూలు నగరంలో లడ్డూలు పంచుకోవడం కాదని.. పల్లెలకు వెళ్లాలని, అక్కడ ప్రజలు ఉతికి ఉతికి ఆరేస్తారని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పూర్తి స్థాయిలో రుణ మాఫీ చేయకుండా తప్పించుకుంటూ ప్రత్యేక విమానాల్లో విశాఖ, సింగపూర్, జపాన్‌లు తిరుగుతున్నారని మండిపడ్డారు. వెంటనే రైతు, డ్వాక్రా రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
 
 ప్రివిలేజ్ మోషన్ పెడతా...!
 ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఉన్న తనపై రౌడీషీటు తెరవడంపై భూమా నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను ఊరికే వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. త్వరలో అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. అక్కడకు వచ్చి ఏం సమాధానం చెబుతారో చెప్పాలన్నారు. అదేవిధంగా న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని తెలిపారు. జిల్లా ఎస్పీకి మేమేంటో తెలియజేస్తామన్నారు.
 
 నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసులకు ఇబ్బందులు తప్పవని.. అప్పుడు టీడీపీ నేతలు గేటు ముందుకు కూడా రానివ్వరని హితవు పలికారు. ఇది ప్రజాస్వామ్య దేశమని.. ఎలాపడితే అలా అధికార పార్టీ నేతలు చెప్పినట్టు చేయడం సరికాదని పోలీసులకు ఆయన సూచించారు. ఇంతటి బానిస బతుకులు ఎందుకని.. దాని బదులు చచ్చేది మేలని పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా పేరు చెబితేనే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్న తాము... అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీగా తొడకొట్టి సమాధానం చెబుతామని, తామేంటో సత్తా చూపిస్తామని ప్రకటించారు.
 
 మంత్రి పదవి ఇస్తామన్నారు...!
 శోభా నాగిరెడ్డి మరణం తర్వాత ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున తన కుమార్తె అఖిలప్రియను పోటీ చేయమన్నారని.. మంత్రి పదవి కూడా ఇస్తామన్నారని భూమా నాగిరెడ్డి తెలిపారు. అయితే, కుదరదని చెప్పానని.. అందుకే ఈ కేసులని మండిపడ్డారు. ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు చేస్తున్నామని, కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఎవ్వరూ కేసులకు భయపడరన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని చంద్రబాబుకు ఆయన హితవు పలికారు. దమ్ముంటే జిల్లాలో ఎక్కడి నుంచైనా పోటీకి రావాలని సవాల్ చేశారు.
 
 తాము 11 మంది ఎమ్మెల్యేల్లో ఎవ్వరైనా రాజీనామా చేస్తాం.. వచ్చి పోటీ చేయాలని, దీనిని రెఫరెండంగా తీసుకుందామని సూచించారు. ప్రధానమంత్రి వద్దకు వెళ్లేందుకు ఎందుకు భయపడుతున్నారని చంద్రబాబును ఉద్దేశించి భూమా అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను అడిగేందుకు ఢిల్లీకి వెళ్లేందుకు ఎందుకు జంకుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యవహారం తెలిసి.. త్వరలో టీడీపీతో స్నేహాన్ని వదులుకుని సొంతంగా వెళ్లాలని కూడా బీజేపీ యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయన్నారు. చంద్రబాబు చుట్టూ ఉన్న వ్యాపారవేత్తలకే ఆయన పెద్దపీట వేస్తున్నారని, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కనీస గౌరవం దక్కడం లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement