ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం | love birds attempts suicide | Sakshi
Sakshi News home page

ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

Sep 19 2013 11:38 PM | Updated on Mar 28 2018 10:56 AM

పెద్దలు తమ వివాహానికి అంగీకరించలేదని మనస్తాపం చెందిన ఓ ప్రేమజంట పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియుడు మృతిచెందగా.. ప్రియురాలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

 వికారాబాద్ రూరల్ న్యూస్‌లైన్:
 పెద్దలు తమ వివాహానికి అంగీకరించలేదని మనస్తాపం చెందిన ఓ ప్రేమజంట పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియుడు మృతిచెందగా.. ప్రియురాలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. వికారాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం ఈ విషాదం చోటుచేసుకుంది. ఎస్‌ఐ హన్మానాయక్ కథనం ప్రకారం.. నవాబుపేట్ మండలం మూలమాడ గ్రామానికి చెందిన తెలుగు భాస్కర్ (22), మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ పసుల గ్రామానికి చెందిన రమ్య(19) కాటేదాన్‌లోని ఓ బిస్కెట్ కంపెనీలో ఏడేళ్లుగా పనిచేస్తున్నారు. వీరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమ చిగురించింది.
 
  పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోవాలనుకున్న వారు.. విషయం ఇంట్లో తెలిపారు. ఇద్దరు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారవడంతో ఇరువర్గాల వారు పెళ్లికి నిరాకరించారు. గురువారం ఉదయం ప్రేమికులు రామయ్యగూడలో ఉన్న భాస్కర్ బంధువుల ఇంటికి వచ్చారు. ఉదయం 10:30 గంటల సమయంలో వికారాబాద్ నుంచి తాండూరు వెళ్లే ప్రధాన రహదారిలో కోర్టు ఎదుట పురుగుమందు తాగి పడిపోయారు. గమనించిన ఓ ఆటో డ్రైవర్ వెంటనే వారిని పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యులు హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించారు. గురువారం రాత్రి 7.30 గంటలకు పరిస్థితి విషమించి భాస్కర్ మృతిచెందాడు. రమ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement