ప్రేమించిన పాపానికి... | Girl Commits Suicide to love affair at Nellore | Sakshi
Sakshi News home page

ప్రేమించిన పాపానికి...

Aug 19 2018 11:26 AM | Updated on Nov 6 2018 8:04 PM

Girl Commits Suicide to love affair at Nellore - Sakshi

 నెల్లూరు / బుచ్చిరెడ్డిపాళెం: ప్రేమించానని వెంటపడ్డాడు. ప్రేమించకపోతే చనిపోతానని బెదిరించాడు. ఇంట్లో తెలియడంతో తల్లి మందలించి బంధువుల ఇంటికి పంపించారని తెలుసుకున్నాడు. తనను పెళ్లి చేసుకోమంటూ నిత్యం ఫోన్లు చేశాడు. సమాధానం లేకపోయే సరికి వాట్సప్‌లో తనతో కలిసిన దృశ్యాలను పంపాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి బంధువులు ఇంట్లో లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని మృతి చెందింది. ఈ ఘటన తెలంగాణ యాదాద్రి జిల్లా కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. బుచ్చిరెడ్డిపాళెం మండలం వవ్వేరుకు చెందిన మెధోమి, మస్తానయ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు. 

వీరిలో పెద్ద కుమార్తె మానస నెల్లూరు వేదాయపాళెంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో నర్సింగ్‌ కోర్సు చదువుతోంది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన యువకుడు తనను ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు. తనను ప్రేమించకపోతే చనిపోతాన న్నాడు. దీంతో ఈ విషయాన్ని మానస తల్లికి చెప్పింది. తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన మానస నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబీకులు ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయించారు. అయినా ఆగక చేయికోసుకుంది. దీంతో తల్లిదండ్రులు మానసను భువనగిరిలోని బంధువుల ఇంటికి పంపించారు. 

ఈ నేపథ్యంలో ప్రియుడు నిత్యం ఫోన్లు చేసి తనను పెళ్లి చేసుకోమని వేధించసాగాడు. సమాధానం లేకపోవడంతో తనతో కలిసిన వీడియోలను వాట్సప్‌ పంపడం ప్రారంభించాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన మానస శనివారం బంధువులు ఇంట్లో లేని సమయంలో ఫ్యానుకు చీరతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అటు ప్రియుడు, ఇటు తల్లి ఎవరూ తనను అర్థం చేసుకోకపోవడంతో తన చెల్లెలకు భవిష్యత్‌లో ఇలా జరగరాదని సూసైడ్‌ నోట్‌లో రాసింది. తన అవయవాలను దానం చేయాలని అందులో కోరింది. భువనగిరి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement