మూడోజోన్‌కు అందని సాగర్ జలాలు | Falling groundwater level | Sakshi
Sakshi News home page

మూడోజోన్‌కు అందని సాగర్ జలాలు

Apr 11 2016 1:28 AM | Updated on Sep 3 2017 9:38 PM

మూడోజోన్‌కు అందని   సాగర్ జలాలు

మూడోజోన్‌కు అందని సాగర్ జలాలు

జిల్లాలోని మూడో జోన్ పరిధిలోని రైతులకు సాగర్ జలాలు అందని ద్రాక్షగా మారాయి.

పడిపోతున్న భూగర్భజల మట్టం
తాగునీటికీ తప్పని కటకట
చోద్యం చూస్తున్న మంత్రి, అధికారులు

 
నూజివీడు రూరల్: జిల్లాలోని మూడో జోన్ పరిధిలోని రైతులకు సాగర్ జలాలు అందని ద్రాక్షగా మారాయి.  పొరుగునే ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా ఎన్నెస్పీ కాలువల్లో సాగర్ జలాలు సవ్వడులు చేస్తున్నా జిల్లాలోని మూడో జోన్‌కు మాత్రం రావడం లేదు. దీంతో  మూడో జోన్‌లోని ప్రజలకు మంచినీటికి పాట్లు తప్పడం లేదు. సాగర్ జలాల కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా కాలువ కట్టలపైన, ఎన్నెస్పీ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించిన దేవినేని ఉమామహేశ్వరరావు ప్రస్తుతం నీటిపారుదలశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ సాగర్ జలాలను తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని రైతులు పెదవివిరుస్తున్నారు. మూడోజోన్‌కు నవంబరు 15 నుంచి మార్చి 15వరకు సాగర్‌జలాలను విడుదల  చేయాల్సి ఉంది.

జిల్లాలోని మూడోజోన్ పరిధిలోని నూజివీడు , మైలవరం బ్రాంచి కాలువల పరిధిలో అనేక మేజర్లు, మైనర్‌లు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 2.20లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.  తిరువూరు, విస్సన్నపేట, ఎ.కొండూరు, మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, వీరులపాడు, నూజివీడు, రెడ్డిగూడెం, ముసునూరు, ఆగిరిపల్లి, బాపులపాడు, విజయవాడ రూరల్, గన్నవరం  మండలాలున్నాయి.  సాగర్ నీటితో పశ్చిమకృష్ణాలోని 260 చెరువులను నింపితేనే ఈ మండలాల్లో తాగునీటి ఎద్దడిని నివారించగలమని సాగర్ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. అయినా మంత్రి దేవినేని ఉమా సాగర్ జలాల విడుదలపై దృష్టి సారించం లేదు.

 మూడోజోన్ సరిహద్దు వరకు వచ్చిన సాగర్‌జలాలు
సాగర్ ఎడమకాలువ మూడోజోన్‌కు సాగర్‌జలాలు విడుదల చేయాలని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డును నీటిపారుదల శాఖ అధికారులు ఏనాడూ అడుగకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం జిల్లాలోని చెరువులను సాగర్‌జలాలతో నింపుకుంటోంది. రెండోజోన్‌లో ఉన్న ఖమ్మం జిల్లాలోని మధిర, బోనకల్ బ్రాంచికాలువలతో పాటు 16,17 నెంబర్ బ్రాంచి కాలువల పరిధిలోను, వైరా చెరువును సాగర్‌జలాలతో నింపుతున్నారు. పాలేరు రిజర్వాయర్ నుంచి 2900క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలి  చెరువులకు తరలిస్తోంది. దీంతో సాగర్‌జలాలు తిరువూరు సరిహద్దులకు వచ్చాయి.  ఈ నీటితో సమీపంలోని లంకాసాగర్‌ను నింపడానికి ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్యలు తీసుకుంటున్నారు.
 
 
 తెలంగాణపై  ఒత్తిడి చేయని ప్రభుత్వం

పశ్చిమకృష్ణాలోని మండలాల్లో  చెరువులన్నీ ఎండిపోయి  భూగర్భజలాలు పడిపోతున్నప్పటికీ  రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడోజోన్‌కు సాగర్‌జలాలను తీసుకువచ్చే ఆలోచన చేయడం లేదు. ఎన్నెస్పీ ప్రాజెక్టు కమిటీ ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని అన్ని ఎస్కేప్‌లను, రెగ్యులేటర్‌లను మూసేసి నీటినంతా పదిరోజుల పాటైనా మూడోజోన్‌కు సరఫరా చేస్తేనే ఎంతోకొంత నీరు  మూడో జోన్‌కు చేరే అవకాశం ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement