ముడుపుల దారి! | - | Sakshi
Sakshi News home page

ముడుపుల దారి!

Nov 16 2026 1:20 AM | Updated on Nov 16 2026 1:20 AM

ముడుపుల దారి!

చింతకొమ్మదిన్నె: ప్రభుత్వ నిబంధనల ప్రకారం, అన్ని అనుమతులతో పారదర్శకంగా వెంచర్‌ ఏర్పాటు చేయాలనుకునే భూయజమానులకు క్షేత్రస్థాయిలో అధికారుల తీరు చుక్కలు చూపిస్తోంది. నిబంధనలను తుంగలో తొక్కి అక్రమ లేఅవుట్లు వేసేవారికి అండగా నిలుస్తున్న కొందరు అధికారులు, చట్టబద్ధంగా ముందుకు వెళ్లేవారిని మాత్రం ముడుపుల కోసం వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చింతకొమ్మదిన్నె మండలం, పాపాసాహెబుపేట పంచాయతీ పరిధిలోని చెర్లోపల్లెలో చోటుచేసుకున్న తాజా ఉదంతమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

ఉచిత రిజిస్ట్రేషన్‌కు ముందుకు వచ్చినా..

చెర్లోపల్లె పరిధిలో ప్రభుత్వ నిబంధనల మేరకు నివాస స్థలాల వెంచర్‌ ఏర్పాటు చేసేందుకు ఓ భూయజమాని కడప అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా)కు దరఖాస్తు చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన కుడా అధికారులు, వెంచర్‌ ఏర్పాటు చేయదలచిన భూమి ముందున్న రహదారి 30 అడుగుల వెడల్పు ఉండాలని నిబంధన విధించారు. ఇందుకు సమ్మతించిన భూయజమాని, తన సొంత భూమి నుంచే రోడ్డు వెడల్పునకు అవసరమైన స్థలాన్ని పంచాయతీకి ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. సంబంధిత పత్రాలతో పాపాసాహెబుపేట పంచాయతీ సెక్రటరీని కలిసి, గిఫ్ట్‌ డీడ్‌ (ఉచిత రిజిస్ట్రేషన్‌) ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు.

సెక్రటరీ మెలిక.. ముడుపుల కోసం

కుతంత్రాలు?

పంచాయతీకి ఆస్తిగా మారే రోడ్డు స్థలాన్ని ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సిన పంచాయతీ సెక్రటరీ, ఆ ప్రక్రియను ముందుకు సాగనివ్వకుండా భూయజమానిని ముప్పుతిప్పలు పెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక, నియోజకవర్గ అధికార పార్టీ నాయకులకు ముడుపులు చెల్లించి వారి నుంచి అనుమతి (క్లియరెన్స్‌) తెచ్చుకోవాలని, అలాగే మండల, జిల్లా స్థాయి అధికారులకు కూడా వాటాలు ఇవ్వాల్సి ఉంటుందని సెక్రటరీ ఒత్తిడి తెస్తున్నట్లు బాధిత భూయజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేసినా.. కదలని ఫైలు!

పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరిగి విసిగిపోయిన భూయజమాని, ఇటీవల కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రోడ్డు వెడల్పు స్థలాన్ని పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించేలా ఆదేశాలివ్వాలని కోరారు. అయితే, ఉన్నతాధికారుల నుంచి కూడా ఇంతవరకు ఎలాంటి స్పందన లేకపోవడం, చర్యలు తీసుకోకుండా మౌనం వహించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మౌనం వెనుక ఉన్నత స్థాయిలో ఏమైనా ఆర్థిక పరమార్థాలు ఉన్నాయా అనే చర్చ స్థానికంగా జరుగుతోంది.

అక్రమ వెంచర్లకు అడ్డాగా చింతకొమ్మదిన్నె!

కడప నగరానికి ఆనుకుని ఉన్న చింతకొమ్మదిన్నె మండలంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. అయితే, ఇక్కడ వెలుస్తున్న వెంచర్లలో మెజారిటీ లేఅవుట్లకు కుడా, రెరా అనుమతులు లేవు. నిబంధనల ప్రకారం కుడా, రెరా అనుమతులు తీసుకుంటే, వెంచర్‌ నిర్వాహకులే సొంత ఖర్చులతో నాణ్యమైన రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్‌ సౌకర్యాలు కల్పించాలి. దీనివల్ల పంచాయతీలపై, ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు ప్లాట్లు కొనుగోలు చేసే సామాన్యులకు భద్రత ఉంటుంది. అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాల్సిన కుడా, టౌన్‌ ప్లానింగ్‌, పంచాయతీ అధికారులు భారీగా ముడుపులు తీసుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. నిబంధనల ప్రకారం వెళ్తే తమకు శ్రీమామూళ్లుశ్రీ అందవనే ఉద్దేశంతోనే, అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఇలా వేధిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు

ఉన్నతాధికారులు తక్షణం స్పందించాలి

జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి చెర్లోపల్లె వెంచర్‌ రోడ్డు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేయించాలని, ముడుపుల కోసం వేధిస్తున్న సిబ్బందిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని భూయజమానితో పాటు స్థానిక వ్యాపారులు, ప్రజలు కోరుతున్నారు.

రోడ్డుకు ఉచితంగా భూమి ఇస్తామన్నా అడ్డుపడుతున్న పంచాయతీ సెక్రటరీ

నాయకులు, అధికారులకు ముడుపుల కోసం వేధింపుల ఆరోపణలు

నిబంధనలు పాటించే వారికి చుక్కలు.. అక్రమ లేఅవుట్ల దందాకు

అండదండలు

చెర్లోపల్లె వెంచర్‌ అనుమతుల వ్యవహారంలో అధికారుల తీరుపై విమర్శలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement