ఖాజీపేట: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ పొగాకు గోడౌన్ పూర్తిగా దగ్ధమైన ఘటన ఆదివారం జరిగింది.ఈ ప్రమాదంలో సుమారు రూ.1.20 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. పత్తూరు పంచాయతీ పరిధిలోని గంగినాయుడుకు చెందిన పొగాకు గోడౌన్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీంతో గోడౌన్లో మంటలు చెలరేగాయి. గమనించిన అక్కడి సిబ్బంది అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించగా ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే, అప్పటికే గోడౌన్లో నిల్వ ఉంచిన పొగాకు కాలి బూడిదైంది. మంటల వేడికి మిగిలిన పొగాకు కూడా రంగు మారి పనికిరాకుండా పోయిందని, దీనివల్ల తనకు రూ.1.20 కోట్లకు పైగా నష్టం జరిగిందని యజమాని గంగినాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.


