– చోరీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం : తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా ఆట కట్టించారు ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీసులు. పట్టణంలోని మోడంపల్లె చాకలివీధిలోని ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు రెండు రోజుల వ్యవధిలోనే ఛేధించారు. చౌడం రాజారాం ఇంట్లో జరిగిన దొంగతనం ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ వివరాలను టూ టౌన్ సీఐ వంశీనాథ్ ఆదివారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. రాజారాం కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి విజయవాడకు వెళ్లారు. ఈ నెల 13న తిరిగి ఇంటికి వచ్చి చూడగా ఇంట్లోని బీరువా, కప్‌బోర్డులలో ఉన్న రూ. 4 లక్షలకు పైగా ఉన్న నగదు కనిపించలేదు. అదే రోజు రాజారాం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీఐ వంశీనాథ్ దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందుకోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే పట్టణంలోని లాడ్జీలలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. చోరీ జరిగిన రోజు కొందరు కొత్త వ్యక్తులు లాడ్జీలో బస చేయడాన్ని పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ప్రొద్దుటూరులోని పెన్నానగర్‌కు చెందిన షేక్ నౌమన్ అలియాస్ మస్తాన్, జమ్మలమడుగుకు పట్టణానికి చెందిన మట్టిదున్నల రామలక్ష్మణ్, చాపాడు మండంలోని పల్లవోలుకు చెందిన దుంపల వినోద్‌కుమార్‌లను నిందితులుగా గుర్తించారు. వినోద్‌కుమార్ ప్రస్తుతం కడపలో నివాసం ఉంటున్నాడు.నిందితులు ప్రొద్దుటూరులోని మండిబజార్ రోడ్డులో ఉండగా ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 4.04 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ తెలిపారు. ఫిర్యాదు అందుకున్న రెండు రోజుల్లోపే నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి పూర్తి స్థాయి చోరీ సొత్తును రికవరీ చేయడంలో కృషి చేసిన టూటౌన్ సీఐ వంశీనాథ్, ఎస్‌ఐ మహబూబ్‌బాషా, ఏఎస్‌ఐ రాజారెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ కృష్ణారెడ్డి,కానిస్టేబుళ్లు గురుశేఖర్, మధుసూదన్‌రెడ్డి, శ్రీకాంత్, అరుణ్, హోంగార్డులు రమేష్, శ్రీనాథ్‌లను డీఎస్పీ బాలస్వామిరెడ్డి ప్రశంసించారు.
చింతకొమ్మదిన్నె: కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని ట్రయోవిజన్ కాంపోజిట్ టెక్నాలజీస్ కంపెనీ ఆవరణలో శనివారం జరిగిన లారీ ప్రమాదంలో అనిల్ హాజోంగ్ (36) అనే సెక్యూరిటీ గార్డు మృతి చెందాడు. చింతకొమ్మదిన్నె పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేఘాలయ రాష్ట్రానికి చెందిన అనిల్ హాజోంగ్ గత నెలలో తన సమీప బంధువుతో కలిసి ఈ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. శనివారం విధి నిర్వహణలో భాగంగా కంపెనీ ప్రాంగణంలో ఉండగా, ప్రమాదవశాత్తూ లారీ వెనుక టైర్ల కింద పడి ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కంపెనీ హెచ్‌ఆర్ నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.


