జగనన్న వరం.. ‘సూపర్‌’ వైద్యం | - | Sakshi
Sakshi News home page

జగనన్న వరం.. ‘సూపర్‌’ వైద్యం

Oct 27 2026 1:56 AM | Updated on Oct 27 2026 1:56 AM

● వైఎస్సార్‌ హయాంలో రిమ్స్‌ ప్రారంభం

● జగన్‌ పాలనలో సూపర్‌ స్పెషాలిటీ ఏర్పాటు

● ఎన్నో విభాగాలు ఆరంభం

● జిల్లా ప్రజలకు చేరువైన ఆధునిక సేవలు

కడప అర్బన్‌ : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జిల్లా ప్రజలకు ‘రిమ్స్‌’ రూపంలో వైద్య వరాన్ని అందించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఏడాదిలోపే కడప రిమ్స్‌ ఆవరణలో సూపర్‌ స్పెషాలిటీ, మానసిక వైద్యశాల, కేన్సర్‌ హాస్పిటల్‌ భవన సముదాయాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కరోనా కష్టకాలం ముగిసిన తరువాత మరలా వేగవంతంగా నిర్మాణాలు చేపట్టి.. 2023 డిసెంబర్‌ 23న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమ చేతుల మీదుగా మూడు భవన సముదాయాలు ప్రారంభించి ప్రజలకు వైద్య సేవలు చేరువయ్యేలా తమ వంతుగా కృషి చేశారు. తరువాత క్లిష్టమైన వ్యాధులకు సైతం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఆధునిక చికిత్సలు అందించాలనే లక్ష్యంతో.. ఏర్పాటు చేసిన కడప ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్య సేవల్లో ముందడుగు వేస్తోంది. గుండె జబ్బులు, నాడీ సంబంధిత వ్యాధులు, మూత్రపిండాల సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు, చిన్నారులకు సంబంధించిన క్లిష్టమైన శస్త్రచికిత్సలు తదితర ప్రత్యేక వైద్య సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. 2024 జనవరి నుంచి 2026 సెప్టెంబరు వరకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం 1,55,536 మంది ఔట్‌ పేషెంట్లు ఆసుపత్రిలో వైద్య సేవలు పొందారు. ఆధునిక వైద్య పరికరాలు, ప్రత్యేక విభాగాలు, శస్త్రచికిత్స సదుపాయాలతో రాయలసీమ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించే కేంద్రంగా ఈ ఆసుపత్రి రూపుదిద్దుకుంటోంది.

రూ.125 కోట్లతో ఆధునిక ఆసుపత్రి

కడప ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని 2023 డిసెంబరు 23న ప్రారంభించారు. మొత్తం రూ.125 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భవన నిర్మాణానికి రూ.75 కోట్లు, వైద్య పరికరాల కొనుగోలుకు రూ.50 కోట్లు కేటాయించారు. 300 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రికి సంబంధించిన ప్రణాళికలో 452 పడకల వరకు సేవలందించే సామర్థ్యాన్ని కల్పించినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఆసుపత్రి నిర్మిత విస్తీర్ణం 2,38,062.46 చదరపు అడుగులు. సుమారు 5.46 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ సముదాయంలో ప్రత్యేక వైద్య విభాగాలు, ఆపరేషన్‌ థియేటర్లు, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లు, అత్యవసర వైద్య సేవలు, రోగ నిర్ధారణ విభాగాలను ఏర్పాటు చేశారు.

తొమ్మిది ప్రత్యేక వైద్య విభాగాలు

ఆసుపత్రిలో కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, మెడికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ, పీడియాట్రిక్‌ సర్జరీ, యూరాలజీ, ప్లాస్టిక్‌ సర్జరీ, సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ, కార్డియో థొరాసిక్‌ అండ్‌ వాస్క్యులర్‌ సర్జరీ (సీటీవీఎస్‌) విభాగాలు అందుబాటులో ఉన్నాయి. గుండె సంబంధిత వ్యాధులకు యాంజియోగ్రామ్‌, యాంజియోప్లాస్టీ వంటి చికిత్సలు, నాడీ సంబంధిత సమస్యలకు ఈఈజీ పరీక్షలు, మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు డయాలసిస్‌ సేవలు అందిస్తున్నారు. జీర్ణకోశ సమస్యలకు ఎండోస్కోపీ పరీక్షలు, మూత్ర సంబంధిత వ్యాధులకు ఆధునిక శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు.

గుండె చికిత్సలకు క్యాథ్‌ ల్యాబ్‌

గుండె సంబంధిత వ్యాధులకు వేగంగా, ఆధునిక పద్ధతుల్లో చికిత్స అందించేందుకు సుమారు రూ.7 కోట్ల విలువైన వైద్య పరికరాలతో క్యాథ్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేశారు.

చిన్నారులకు క్లిష్టమైన శస్త్రచికిత్సలు

పీడియాట్రిక్‌ సర్జరీ విభాగంలో నవజాత శిశువులు, చిన్నపిల్లలకు సంబంధించిన పలు క్లిష్టమైన శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. ల్యాపరోస్కోపిక్‌ పైలోప్లాస్టీ, ల్యాపరోస్కోపిక్‌ నెఫ్రెక్టమీ, వెసికో యూరెటరిక్‌ రీ ఇంప్లాంటేషన్‌, ల్యాపరోస్కోపిక్‌ ఫండోప్లికేషన్‌ వంటి ఆధునిక శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయి. విల్మ్‌స్‌ ట్యూమర్‌, న్యూరోబ్లాస్టోమా, టెరటోమా వంటి కణితులకు చికిత్సతోపాటు గ్యాస్ట్రిక్‌ పుల్‌–అప్‌, రెట్రోపెరిటోనియల్‌ టెరటోమా తొలగింపు వంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి వివరాల్లో పేర్కొన్నారు.

యూరాలజీ, ప్లాస్టిక్‌ సర్జరీలో..

యూరాలజీ విభాగంలో మూత్ర సంబంధిత వ్యాధులకు టీయూఆర్‌పీ, పీసీఎన్‌ఎల్‌, యూఆర్‌ఎస్‌ వంటి ఆధునిక శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఫియోక్రోమోసైటోమా వంటి అరుదైన వ్యాధులకు కూడా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్లాస్టిక్‌ సర్జరీ విభాగంలో కాలిన గాయాల బాధితులకు చికిత్స, చీలిక అంగిలి శస్త్రచికిత్సలు, టెండన్‌ రిపేర్‌, ఫ్లాప్‌ సర్జరీలు అందిస్తున్నారు. సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో ల్యాపరోస్కోపిక్‌ కొలిసిస్టెక్టమీ, ఇతర అవసరమైన శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు.

ఆక్సిజన్‌ ప్లాంట్‌

ఆసుపత్రిలో రోగులకు నిరంతర ఆక్సిజన్‌ సరఫరా కోసం రోజుకు 11 వేల లీటర్ల సామర్థ్యంతో లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఆక్సిజన్‌ సరఫరా వ్యవస్థను కూడా అందుబాటులోకి తెచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement