● పోలింగ్ ప్రశాంతంగా జరిగేనా!
● నామినేషన్లలో కూటమి దౌర్జన్యకాండ
● ప్రతిపక్ష పార్టీపై పోలీసులను
ప్రయోగిస్తున్న వైనం
జమ్మలమడుగు : జమ్మలమడుగు పోరు ఉత్కంఠ రేపుతోంది. మున్సిపల్ ఎన్నికలు సజావుగా జరుగుతాయా అనే అనుమానాలు ప్రతిపక్ష పార్టీలతోపాటు ప్రజలు, రాజకీయ ప్రముఖులు వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎర్రగుంట్ల, జమ్మలమడుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఎర్రగుంట్లలో చైర్‌పర్సన్, కౌన్సిలర్ స్థానాలకు వైఎస్సార్‌సీపీ తరఫున నామివేషన్‌లు వేయనీయకుండా.. టీడీపీ నాయకులు అడ్డుకుని దాడులకు తెగబడ్డారు. దీంతో మొత్తం 28 కౌన్సిలర్ స్థానాలు, చైర్‌పర్సన్ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకున్నారు.
మాజీ మంత్రి శివారెడ్డి కుమార్తె పోటీ
జమ్మలమడుగు మున్సిపల్ పోరులో మాజీ మంత్రి శివారెడ్డి కుమార్తె, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సోదరి అయిన ఎన్.హైమావతి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేశారు. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి కోడలు, భూపేష్‌రెడ్డి భార్య అయిన జ్యోతి బరిలో ఉన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 32 కౌన్సిలర్ స్థానాలు ఉండగా.. నాలుగు (21, 24, 25, 26) స్థానాలను టీడీపీ వారు ఏకగ్రీవం చేసుకున్నారు. ఇక్కడ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను బెదిరించి, ఏకగ్రీవం చేసుకున్నారు. మిగిలిన 28 కౌన్సిలర్, మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాలకు పోటీ జరుగుతోంది. నవంబర్ 1వ తేదీన పోలింగ్ జరగనుంది. అధికార పార్టీకి చెందిన నాయకులు ఇప్పటికే ప్రతిపక్ష నాయకులను పోలీసుల సహకారంతో గృహ నిర్బంధం చేసి.. పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లను భయపెట్టడం, గెంటివేయడం వంటి కార్యకలాపాలకు తెరలేపే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం సాగుతోంది.
పోలీసుల తీరుపై అనుమానాలే..
నియోజకవర్గంలో ఆరు మండలాల్లో ఉండగా.. ఐదు మండలాల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఒక్క నామినేషన్ వేయనివ్వకుండా టీడీపీ నాయకులు పోలీసుల సహకారంతో అడ్డుకున్నారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు పోలీసులు సజావుగా జరగనిస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్థానికంగా ఉన్న పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న సంగతి ప్రజలు, ప్రతిపక్ష పార్టీ నాయకులకు తెలిసిపోయింది. దీంతో అధికార పార్టీ నాయకులు ఎన్నికల రోజున దాడులకు పాల్పడినా, ప్రతిపక్ష పార్టీలు వాటిని ప్రతిఘటించినా.. కేసులు మాత్రం ప్రతిపక్ష పార్టీల పైనే పెట్టే విధంగా ఇప్పటికే వారికి ఆదేశాలు అందినట్లు సమాచారం. ప్రజాస్వామ్య బద్ధంగా, ప్రశాంతమైన పరిస్థితుల్లో ఓటింగ్‌లో పాల్గొనే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు.


