టీడీపీ వర్గీయుల బాహాబాహీ | - | Sakshi
Sakshi News home page

టీడీపీ వర్గీయుల బాహాబాహీ

Oct 28 2026 5:54 AM | Updated on Oct 28 2026 5:54 AM

చాపాడు : అధికారం అండతో ఎంపీటీసీ ఎన్నికల్లో 12 స్థానాలను టీడీపీ వర్గీయులు కై వసం చేసుకున్నారు. ఈ క్రమంలో ఊరికే వచ్చే పదవులు మాకు కూడా కావాలంటూ.. నామినేషన్ల ఉపసంహరణ రోజు టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి.. ఎన్నికల కేంద్రం వద్దనే బాహాబాహీకి దిగారు. చియ్యపాడు–1 ఎంపీటీసీ స్థానం కోసం స్థానికులతోపాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మునిశేఖర్‌రెడ్డి సతీమణి రాజేశ్వరి నామినేషన్‌ వేశారు. ఈ క్రమంలో రాజేశ్వరిని మినహాయించి ఇతరులు ఉపసంహరణ చేసుకోవాలని ఓ వర్గం టీడీపీ నేతలు ఆదేశించారు. దీనికి ససేమిరా అనడంతో టీడీపీ మాజీ మండల అధ్యక్షులు, ఏపీఐడీసీ డైరెక్టర్‌ అన్నవరం సుధాకర్‌రెడ్డి వర్గీయులు.. మరో వర్గం నేతలైన మునిశేఖర్‌రెడ్డి, నరసింహారెడ్డిల మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో ఇరువైపులా ఉన్న కార్యకర్తలు మాటకుమాట పెంచుకొని తోపులాట జరిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టారు. ప్రతి ఎంపీటీసీ స్థానానికి ఒక్కరే కాకుండా నలుగురు వరకు నామినేషన్లు వేయడం, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ కూడా ఒక వ్యక్తిని నిర్ణయించకుండా నామినేషన్లు వేసుకోండని చెప్పడంతోనే.. టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తిందని ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

ఈ విషయం తెలుసుకున్న రూరల్‌ సీఐ శివశంకర్‌ చాపాడులోని నామినేషన్‌ కార్యాలయం వద్దకు రావడంతో.. ఇరు వర్గాల టీడీపీ నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతోపాటు బద్రిపల్లె ఎంపీటీసీ స్థానం విషయంలోనూ ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఎన్నికలు జరగకుండానే పదవులు వస్తున్నాయని, ఎలాగైనా దక్కించుకోవాలని టీడీపీ నేతలు పాకులాడుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.

పదవుల కోసం కొట్లాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement