వృద్ధుడి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

వృద్ధుడి అదృశ్యం

Oct 28 2026 5:54 AM | Updated on Oct 28 2026 5:54 AM

సిద్దవటం : మండలంలోని మంగనవాండ్లపల్లె గ్రామానికి చెందిన పిల్ల కత్తుపు ఈశ్వరయ్య(60) అనే వృద్ధుడు కపించడం లేదని ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హారిక తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆమె మంగళవారం వివరాలు వెల్లడించారు. ఈశ్వరయ్య కడప నగరంలోని చిన్న చౌక్‌ సమీపాన కొన్నేళ్లుగా తోపుడు బండిపై వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగించే వాడు. గత నెల 27న సాయంత్రం వ్యాపారం చేసి దాచుకున్న సొమ్ము తన జేబులో నుంచి పడిపోవడంతో.. డబ్బు కోసం వెతుకుతూ కనపడకుండా పోయాడని తెలిపారు. పొట్టేలు వ్యాపారం కోసం కొంత మంది వద్ద అప్పులు చేశాడని పేర్కొన్నారు. ఆయన భార్య రమాదేవి మాట్లాడుతూ తన భర్త వ్యాపార నిమిత్తం అప్పులు చేసి నష్టపోయాడని, అతను కనపడకపోవడంతో కొంత మంది తమ ఇంటి వద్దకు వచ్చి డబ్బులు అడుగుతున్నారని, వ్యాపార నిమిత్తం అప్పులు చేసి కనపడకుండా పోయాడని స్థానిక పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం రాత్రి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

రైలులో గుండెపోటుతో ప్రయాణికుడి మృతి

నందలూరు : తిరుపతి నుంచి హైదరాబాద్‌లోని కాచిగూడకు వెళ్తున్న వెంకటాద్రి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడు గుండెపోటుతో మృతి చెందాడు. మంగళవారం ఈ ఘటన నందలూరు సమీపంలో చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన రఘోత్తం(68) అనే వ్యక్తి తిరుపతికి వచ్చి, తిరిగి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఎస్‌ 3 బోగిలోని 28వ నెంబర్‌ బర్త్‌లో ప్రయాణిస్తుండగా అస్వస్థతకు గురై మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయాన్ని రైల్వే టికెట్‌ తనిఖీ అధికారి (టీటీ)తోపాటు తోటి ప్రయాణికులు రైల్వే అధికారులకు తెలియజేశారు. దీంతో నందలూరుకు చెందిన రైల్వే జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ పోలీసులు.. మృతదేహాన్ని రైలు నుంచి కిందికి దించి స్వాధీనం చేసుకున్నారు. మృతుడి బంధువులకు సమాచారం అందించినట్లు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో

హెచ్‌ఎం దుర్మరణం

గోపవరం : మండలంలోని పి.పి.కుంట సమీపంలో నెల్లూరు – ముంబై (ఎన్‌హెచ్‌–67) జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అట్లూరు మండలం అరుంధతినగర్‌ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా పని చేస్తున్న కంజదల(59) దుర్మరణం చెందింది. కారులో నెల్లూరు నుంచి అట్లూరుకు వెళుతుండగా పి.పి.కుంట సమీపంలో ఓవర్‌టేక్‌ చేయబోయి.. రోడ్డు పక్కనే ఆగి ఉన్న మినీ ఆల్వీన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రధానోపాధ్యాయురాలు కంజదల అక్కడికక్కడే మృతి చెందగా ఆమె భర్త క్రిష్ణమూర్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన ప్రాంతానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ప్రధానోపాధ్యాయురాలు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రధానోపాధ్యాయురాలికి సహచర ఉపాధ్యాయులు శ్రద్ధాంజలి ఘటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement