మాజీ కౌన్సిలర్‌పై హత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

మాజీ కౌన్సిలర్‌పై హత్యాయత్నం

Oct 28 2026 5:54 AM | Updated on Oct 28 2026 5:54 AM

మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీలోని సర్వాయపల్లెకు చెందిన మాజీ కౌన్సిలర్‌ ముత్తూరు చిన్నసుబ్బారెడ్డి(47)పై మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిన్న సుబ్బారెడ్డి 2021లో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో 10వ వార్డు నుంచి టీడీపీ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. మంగళవారం షుగర్‌ వ్యాధి మాత్రల కోసం బైక్‌పై ప్రొద్దుటూరుకు వెళ్లి తిరిగి వస్తుండగా.. సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో చాపాడు మండలం విశ్వనాథపురం సమీపంలో బళ్లారి – కృష్ణపట్నం జాతీయ రహదారి అండర్‌ పాస్‌ బ్రిడ్జికి సమీపంలో కారులో వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు సుబ్బారెడ్డిని ఆపారు. బద్వేలుకు ఎలా వెళ్లాలి అంటూ అడిగారు. బైపాస్‌ పైన వెళ్లవచ్చు, లేదంటే మైదుకూరు మీదుగా వెళ్లవచ్చు అని సుబ్బారెడ్డి వారికి వివరించారు. అంతలోనే ముగ్గురిలో ఓ వ్యక్తి కత్తితో సుబ్బారెడ్డి కడుపులో పొడిచాడు. తిరిగి గొంతుపై పొడిచేందుకు ప్రయత్నించగా సుబ్బారెడ్డి తప్పించుకొని అతన్ని తోసేసి గట్టిగా కేకలు వేస్తూ పరిగెత్తాడు. దాంతో ముగ్గురు వారు వచ్చిన కారులోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాధితుడు తన అన్న పెద్ద సుబ్బారెడ్డికి ఫోన్‌ చేసి చెప్పగా.. అతను తన బంధువులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని మైదుకూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అర్బన్‌ సీఐ హాజీవలి ఆస్పత్రికి చేరుకుని వివరాలను తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స కోసం చిన్న సుబ్బారెడ్డిని ప్రొద్దుటూరుకు తరలించారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిన్న సుబ్బారెడ్డికి వ్యక్తిగతంగా ఎవరితోనూ గొడవలు లేవని, గుర్తు తెలియని వ్యక్తుల ఎందుకు అతన్ని పొడిచారో తెలియడం లేదని గ్రామస్తులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement