ఎన్నికల్లో అధికార దుర్వినియోగం | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో అధికార దుర్వినియోగం

Oct 28 2026 6:06 AM | Updated on Oct 28 2026 6:06 AM

పులివెందుల : కలసికట్టుగా పోరాడుదాం.. విజయం సాధిద్దామని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయని, సహజంగా ఎన్నికలంటే ఎక్కడైనా అభివృద్ధి అనేది ఒక అజెండాగా ఉంటుందని, కానీ ఇవాళ ఆరాచకాలు, అధికార దుర్వినియోగానికి పూర్తి స్థాయిలో పాల్పడిన పరిస్థితులు చూస్తున్నామని పేర్కొన్నారు. మంగళవారం పులివెందుల పట్టణం భాకరాపురంలోని వైఎస్సార్‌ ఆడిటోరియంలో మున్సిపల్‌ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గం నుంచి దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కానీ, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం అనేక రకాలుగా ముందడుగు వేసిందని, అభివృద్ధి చెందిందన్నారు. కృష్ణా జలాలు పులివెందులకు వచ్చాయంటే వారిద్దరి చలువేనన్నారు. గండికోటలో కేవలం 10 టీఎంసీల నీరు నిల్వ పెట్టే అవకాశం ఉంటే.. దాదాపు రూ.1000 కోట్ల పైచిలుకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ చెల్లించి 27 టీఎంసీల నీరు పెట్టే దిశగా జగనన్న ప్రభుత్వం చేసిందన్నారు. చిత్రావతి రిజర్వాయర్‌లో 5 టీఎంసీల నీరు మించి నిల్వ ఉంచిన పరిస్థితి లేదని, జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక రూ.270 కోట్లు ఖర్చుపెట్టి 4 గ్రామాలు ఆర్‌అండ్‌ఆర్‌ చేసి 10 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే పరిస్థితి చేశారన్నారు.

టీడీపీ తప్పుడు ప్రచారం

పులివెందుల నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీరు ఇవ్వాలని రూ.480 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ పథకాన్ని 2021లో జగనన్న భూమిపూజ చేసి 80 శాతం పనులు పూర్తి చేశారని, కూటమి ప్రభుత్వం వచ్చాక మిగిలిన 20 శాతం పనులు కూడా సరిగా చేయలేదని, అయినప్పటికీ వారు పనులు పూర్తి కాకుండానే ప్రారంభించి మొత్తం మేమే చేశామని గొప్పలు చెప్పుకొంటున్నారన్నారు. నిసిగ్గుగా తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. దాదాపు రూ.500 కోట్లతో అద్భుతంగా మెడికల్‌ కళాశాలకు సంబంధించిన బిల్డింగ్‌లు, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి నిర్మించామని, ఆ మెడికల్‌ కళాశాలకు 2024–25 అకడమిక్‌ ఇయర్‌లో నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ 50 సీట్లు మంజూరు చేసిందని, వచ్చిన సీట్లను కూడా టీడీపీ ప్రభుత్వం మాకు వద్దని చెప్పి వెనక్కి రాసి పంపించిందన్నారు. ఈ ప్రాంతంపైన, ఇక్కడి ప్రజలపైన తెలుగుదేశం ప్రభుత్వానికి ఎటువంటి ద్వేషముందో మీరందరూ ఆలోచించాలన్నారు. జగనన్న హయాంలో ఇక్కడి ఆసుపత్రిలో అత్యాధునికమైన పరికరాలను పెడితే.. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని కూడా బయటికి షిఫ్ట్‌ చేసిందన్నారు.

జగనన్న కాలనీలో ఆగిన ఇళ్లు

పులివెందులలో ఇల్లు లేని వారందరికీ ఇల్లు నిర్మించాలనే ఉద్దేశంతో జగనన్న హౌసింగ్‌ లేఅవుట్‌లో దాదాపు 8 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేస్తే కోర్టుకు వేసి అడ్డుకున్నారన్నారు. కోర్టులో క్లియర్‌ చేసుకుని బహిరంగ సమావేశం పెట్టి 8 వేల మందికి పట్టాలు ఇచ్చి ఇళ్ల పనులు మొదలు పెట్టామన్నారు. చాలా ఇళ్లు పూర్తి దశకు వచ్చాయని, కొన్ని రూప్‌వెల్‌ స్టేజ్‌లో ఉన్నాయని, కొన్ని బేస్‌మెంట్‌ లెవెల్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ 30 మాసాల్లో ఒక్క రూపాయి పనులు కూడా జరగలేదన్నారు. కేవలం పులివెందుల మీద కక్ష కాకుంటే మరేమిటి అని టీడీపీ నాయకులను, చంద్రబాబు నాయుడును అడుగుతున్నానన్నారు.

ప్రతి ఒక్కరూ ఆలోచించాలి

పులివెందులలోని రోటరీపురంలో కానీ, బ్రాహ్మణపల్లెలో కానీ యూజీడీ వల్ల పెండింగ్‌లో ఉన్న రోడ్లు మన ప్రభుత్వ హయాంలో కొద్దో గొప్పో మిగిలాయో.. ఆ పనులను కూడా ఈ ప్రభుత్వం చేపట్టలేదన్నారు. రైతుల కోసం దాదాపు రూ.25 కోట్లతో జగనన్న 2024 మార్చిలో ఇంటిగ్రేటెడ్‌ బనానా ప్యాక్‌ హౌస్‌ ప్రారంభించారని, ఎన్నికల కోడ్‌ వెంటనే రావడం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టించుకోలేదన్నారు. రైతుల కోసం రూ.25 కోట్లు ఖర్చుపెట్టి కోల్డ్‌ స్టోరేజ్‌ నిర్మించామని, కూటమి వచ్చిన తర్వాత మూసిన దాన్ని మూసినట్లుగానే పెట్టేసిందన్నారు. కనీసం ఒక యూజర్‌ ఐడీని ఐడెంటిటీఫై చేసి ఆ కోల్డ్‌ స్టోరేజీని వినియోగంలోకి తీసుకురాలేని పరిస్థితి చూస్తున్నామన్నారు. ఈ నియోజకవర్గం అప్పట్లో రాజశేఖరరెడ్డి హయాంలో, తర్వాత జగనన్న హయంలో ఏ రకంగా అభివృద్ధి విషయంలో ముందడుగు వేసింది, ఆ తర్వాత ఇప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు హయాంలో ఏ రకంగా అన్ని రకాలుగా వెనుకబడ్డామో అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరుతున్నానన్నారు.

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలి

ఇవాళ నామినేషన్‌ ప్రక్రియ ఏ విధంగా జరిగిందో చూశామని, నామినేషన్లు వేయాలంటేనే యుద్ధం చేయాల్సిన పరిస్థితి మనందరికీ వచ్చిందని, మీరందరూ చూశారన్నారు. ఇటువంటి పరిస్థితులలో ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయని, మన కార్యకర్తల మీదనే దాడి చేసి మన మీదనే తప్పుడు కేసులు పెట్టి.. పోలీసులు దాదాపు 900 మందిని నిందితులుగా చేర్చి వేధించి ఇబ్బంది పెడుతున్నారన్నారు. అధికార పార్టీకి ఎన్నికలలో లబ్ధి చేకూర్చాలని చెప్పి పోలీసు యంత్రాంగం మొత్తం పని చేసిందన్నారు. ఇటువంటి ప్రతికూల పరిస్థితులలో ఎన్నికలు చేస్తున్నామని, మీ అందరికీ మనవి చేస్తున్నా.. మనందరం కూడా తప్పకుండా ఏకం కావాలని, ఏకమై జగనన్న నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో బలపరచాలని కోరుతున్నానన్నారు. ఇక్కడ ఉన్న అన్నదమ్ముళ్లు, అక్కాచెల్లెమ్మలను పేరు పేరునా మనవి చేసుకుంటున్నానని, మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్‌ ప్రమీలమ్మ, 20 వార్డులలో బరిలో ఉన్న మన కౌన్సిలర్‌ అభ్యర్థులు, అదే విధంగా మండలాల్లో నాలుగు జెడ్పీటీసీ స్థానాలకు చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం

తప్పుడు కేసులకు ఎవరూ భయపడొద్దని, ఈ కేసులన్నీ ఎన్ని రోజులు నిలబడేవి కావని, పోలీసులకు కూడా ఈ విషయం తెలుసని, కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మనల్ని వేధించాలని చెప్పి పెడుతున్నారన్నారు. ఇటువంటి వాటిపై మనం గట్టిగా నిలబడి ఎదుర్కోవాలని, రాబోయే రోజుల్లో వీరికి తగిన గుణపాఠం చెప్పే బాధ్యత మాది అని పేర్కొన్నారు.

పోరాడుదాం.. విజయం సాధిద్దాం

అభివృద్ధి వైఎస్‌ఆర్‌, జగనన్నతోనే సాధ్యం

పులివెందులపై కక్ష గట్టిన చంద్రబాబు

తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చింది

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement