కడప కార్పొరేషన్ : ప్రశాంతతకు, మతసామరస్యానికి మారుపేరైన కడపలో కూటమి నాయకులు చిచ్చు రేపారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర అన్నారు. సోమవారం కడపలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక పక్క టీడీపీ నాయకుల దౌర్జన్యాలు, అరాచకాలు, దాడులు జరుగుతున్నప్పటికీ.. వైఎస్సార్‌సీపీ తరఫున బండి దీప్తి నామినేషన్ వేయడం గర్వకారణమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో కడపలో ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరంగా, విద్యాభివృద్ధి, ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చే మార్పులు వచ్చాయని తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో కులమతాలు, పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. ప్రస్తుతం కడప మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల దశ నుంచే దాడులు, దౌర్జన్యాలు చోటుచేసుకోవడం ఆందోళనకరమని విమర్శించారు. మాజీ డిప్యూటీ మేయర్ కుమారుడిపై దాడి చేయడం, నామినేషన్ పత్రాలు లాక్కొని చించివేయడం, ఎన్నికల ప్రచార సమయంలో ఖలీద్, షంషీర్‌పై దాడులు జరగడం వంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి విఘాతమన్నారు. ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తోందని, పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధిస్తారనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి
వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి మాట్లాడుతూ కడప ప్రజలు ఇలాంటి ఎన్నికలను ఎప్పుడూ చూసి ఎరుగరన్నారు. ఇక్కడి ప్రజలు ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటారని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి దౌర్జన్యకర ఘటనలు ఒక్కటి కూడా జరగలేదన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు దాసరి శివప్రసాద్, తోటక్రిష్ణ, క్రిష్ణతేజ, సుదర్శన్ రాయల్, సింధు, రామక్రిష్ణ, సాయిదత్త, మల్లీశ్వరి పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
వంగవీటి నరేంద్ర


