అంగీకారం లేని ఏకగ్రీవం | - | Sakshi
Sakshi News home page

అంగీకారం లేని ఏకగ్రీవం

Oct 27 2026 1:56 AM | Updated on Oct 27 2026 1:56 AM

● ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన టీడీపీ

● మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి

ప్రొద్దుటూరు : 116 ఏళ్ల ప్రొద్దుటూరు మున్సిపాలిటీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 52 మంది కౌన్సిలర్లతోపాటు మున్సిపల్‌ చైర్మన్‌గా నంద్యాల రాఘవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. సాధారణంగా ఇరుపార్టీల అంగీకారంతోనో.. ఇతర కారణాల వల్లో ఏకగ్రీవం చేస్తారని, అయితే ఎవరి ప్రమేయం లేకుండానే సొంతంగా వారు ఏకగ్రీవం అయ్యారన్నారు. సోమవారం దొరసానిపల్లెలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 16 మంది తమ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వెళితే పోలీసులు, వరద కుటుంబీకులు దౌర్జన్యం చేసి వెనక్కి పంపారన్నారు. తొలి రోజున 36 మంది నామినేషన్లు దాఖలు చేస్తే తన భార్య రమాదేవి మినహా మిగతా 35 నామినేషన్లు చెల్లవని అధికారులు తిరస్కరించారని తెలిపారు. మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి నామినేషన్‌ పత్రంలో సంతకం చేయలేదని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. సిగ్గు ఎగ్గు లేకుండా ప్రజాస్వామ్యానికి బట్టలు ఊడదీసి బజారులో నిలబెట్టారన్నారు. ఇందులో ఎన్నికల కమిషన్‌, పోలీసు అధికారులు, కలెక్టర్‌ ఉన్నా తమకు జరిగిన అన్యాయాన్ని అడ్డుకోలేక పోయారని తెలిపారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కుటుంబీకులు దౌర్జన్యం చేయడమే ఇందుకు కారణమన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌, 52 మంది కౌన్సిలర్లు, 33 మంది ఎంపీటీసీలు, ఒక జెడ్పీటీసీ ఏకగ్రీవం చేసుకున్నారన్నారు. పోటీలో ఉన్న రాజుపాళెం జెడ్పీటీసీ అభ్యర్థిని పోలీసులు వెంటాడుతున్నారని తెలిపారు. తాము ఇప్పటి వరకు 88 నామినేషన్లు వేయగా ఒక్కటి మాత్రమే చెల్లుబాటు అయిందని చెప్పారు.

బీసీకి ఇవ్వాల్సిన స్థానం ఓసీకి..

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యే వరద కుటుంబీకులతోపాటు అధికారులు కలసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని స్పష్టం చేశారు. బీసీ కేటగిరికి రావాల్సిన మున్సిపల్‌ చైర్మన్‌ స్థానాన్ని ఓసీకి ఇవ్వాలని స్వయంగా వరద సీఎం చంద్రబాబు లేఖ రాసి తెచ్చుకున్నారన్నారు. ఓటు లేని తన సోదరుడు రాఘవరెడ్డికి ఓటు హక్కు కల్పించి ప్రజలు ఓటు వేయకుండా చేశారన్నారు. ఇందులో జిల్లా ఉన్నతాధికారిని మేనేజ్‌ చేశారని తెలిపారు. తమకు జరిగిన అన్యాయంపై సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసినా కలెక్టర్‌, ఎస్పీల నివేదిక ఆధారంగా తమకు అన్యాయం జరిగిందన్నారు. తమతోపాటు ఏ పార్టీ వారు వేసిన నామినేషన్లు కూడా చెల్లలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement