ఒంటిమిట్ట : మండలంలో 2020 మార్చి 1న జరిగిన హత్య కేసులో నిందితుడు ధనుష్ కి సోమవానం కడప ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు శిక్ష, రూ.50 వేల జరిమానా విధించింది. పోలీసుల వివరాల మేరకు.. కొత్తమాధవరం శ్రీ సాయి కాళేశ్వరి డిగ్రీ కళాశాల వద్ద ఉన్న శ్రీ సాయిరాం సిమెంట్ బ్రిక్స్ ఫ్యాక్టరీ వాచ్‌మెన్‌గా పని చేస్తున్న కత్తి వెంకట రమణ(50) అనాథనంటూ తన దగ్గరకు వచ్చిన ధనుష్‌ను మానవతా దృక్పథంతో తానున్న ఫ్యాక్టరీలోనే ఆశ్రయం కల్పించి, కూలీ పనుల్లో చేర్పించాడు. ఇది ఇలా ఉండగా హత్యకు ముందు నిందితుడు ధనుష్ ఖర్చుల నిమిత్తం వెంకటరమణను రూ.500 ఇవ్వాలని కోరగా ఆయన నిరాకరించారు. దీంతో వెంకటరమణపై కక్ష పెంచుకున్న ధనుష్ 2020 మార్చి 1న తెల్లవారుజామున ఫ్యాక్టరీ ప్రాంగణంలోని తూర్పు వైపు ఖాళీ స్థలంలో నిద్రిస్తున్న వెంకటరమణ తలపై బలమైన ఆయుధంతో దాడి చేసి దారుణంగా హత్య చేసి, పరారయ్యాడు. దీంతో అప్పట్లో మృతుడి కుమారుడు కత్తి భరత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒంటిమిట్ట పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహానికి పంచనామా నిర్వహించి, నిందితుడిని అరెస్ట్ చేసి సాక్ష్యాధారాలతో న్యాయస్థానంలో చార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.ఎస్ శైలజ హాజరై, సాక్షులను సమర్థవంతంగా ప్రవేశపెట్టి నేరాన్ని నిరూపించేలా బలమైన న్యాయవాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రమేష్ కుమార్ నిందితుడు ధనుష్ పై హత్యా నేరం రుజువైనట్లు నిర్ధారించి జీవిత ఖైదు, రూ.50 వేల జరిమాన విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసులో నిందుతుడికి శిక్ష పడేందుకు నిరంతరం కృషి చేసి, కోర్టు విచారణ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన కోర్టు మానిటరింగ్ సెల్ హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాయుడు, కానిస్టేబుల్ శ్రీనివాసులరెడ్డి, ఒంటిమిట్ట ఏఎస్‌ఐ సుబ్బయ్యలను జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అభినందించారు.


