సింహాద్రిపురం : మండలంలోని కసనూరు–దుద్దేకుంట్ల మార్గంలో ఉన్న వాగు ప్రవాహంలో ఓ యువకుడు శనివారం రాత్రి కొట్టుకుపోయి మృతి చెందాడు. సింహాద్రిపురం ఎస్‌ఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తొండూరు మండలం గంగాదేవిపల్లెకు చెందిన యలంకూరు వరుణ్‌కుమార్‌రెడ్డి(29) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేస్తున్నాడు. ఆయన శనివారం కసనూరు గ్రామానికి బైకుపై వచ్చాడు. మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షం వల్ల సాయంత్రం వరకు ఆ గ్రామంలో ఉండి.. వర్షం తగ్గిన తర్వాత దుద్దేకుంట్ల గ్రామంలో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్లాడు. అయితే కసనూరు–దుద్దేకుంట్ల గ్రామ మధ్యలో ఉన్న వాగు నిన్న కురిసిన వానకు ఉధృతంగా ప్రవహిస్తుండేది. ఇది గమనించని అతను బైకుపై వెళ్లాడు. ఆ వాగు నీటి ప్రవాహానికి బైకుతో సహా కొట్టుకుపోయాడు. ఆదివారం ఉదయం తల్లిదండ్రులకు కుమారుడు వచ్చాడా అని అడిగితే.. తమ కుమారుడు రాలేదని తెలపడంతో వారు వెతకడం మొదలు పెట్టారు. వాగు వద్ద బైకు కనిపించడంతో అక్కడ వెతకగా.. కొద్ది దూరంలో వరుణ్‌కుమార్‌రెడ్డి మృతి చెంది కంప చెట్లలో చిక్కుకొని ఉన్నాడు. గ్రామస్తుల సహాయంతో మృతదేహన్ని తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. ఆయనకు మూడు నెలల క్రితమే వివాహమైంది.


