● చివరి రోజు నామినేషన్లు దాఖలుకు అడ్డంకులు
● రెచ్చిపోయిన టీడీపీ గుండాలు... నిలువరించని పోలీసులు
● మండల కేంద్రాలు రణరంగంగా మారిన కట్టడి చేయడంలో విఫలం
● వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు అడుగడుగునా ఆటంకాలు
పోలీసుల ఆంక్షల సంకెళ్లలో
ప్రజాస్వామ్యం బందీ అయింది..
పచ్చ నేతల పదవీ కాంక్షల్లో
ఓటుస్వామ్యం నలిగిపోయింది..
దేశ రాజ్యాంగానికి ముళ్ల కంచెతో
అడ్డుకట్ట వేస్తూ...
‘దేశ’ ‘రెడ్‌బుక్’కు ‘పచ్చ’తివాచీ పరుస్తూ..
ఖాకీలు ప్రజాహక్కులకు పాతరేశారు..
పట్టపగలు పచ్చ మూకలు
రౌడీయిజం చేస్తుంటే..
ఆఫీసుల్లోకి దూరి ఆర్వో నుంచి
నామినేషన్ పత్రాలు లాగేస్తుంటే..
పోలీసులు కళ్లు మూసుకున్నారు..
వైఎస్సార్సీపీ నేతలను.. అభ్యర్థులను
గడప దాటొద్దంటూ..
కడపకు వెళ్లొద్దంటూ..
గృహ నిర్బంధాలు చేశారు..
వారం రోజుల క్రితం మొదలైన హింసాకాండ..
కొనసాగుతూనే ఉంది..
నర‘నారా’నా పచ్చోన్మాదంతో
అల్లరిమూక చెలరేగుతూనే ఉంది.
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో సరిగ్గా వారం రోజుల క్రితం మొదలైన హింసాకాండ కొనసాగుతూనే ఉంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల చివరిరోజూ దౌర్జన్యపర్వం కొనసాగింది. జిల్లాలో పలు మండలాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శుక్రవారం ఎంపీటీసీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ మహిళామణులపై పచ్చ గూండాలు దౌర్జన్యం చేశారు. ముఖ్యంగా కలసపాడు, వీరబల్లె, మైలవరం, సుండుపల్లె మండలాలల్లో మహిళలపై టీడీపీ మృగాలు ప్రత్యక్షదాడులకు తెగబడ్డారు. ఇక జెడ్పీటీసీల నామినేషన్ల కేంద్రంలో యథావిధిగా టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి అండ్ కో దౌర్జన్యపర్వం కొనసాగింది. అభ్యర్థుల నామినేషన్లు పత్రాలు చించేయడం, అప్పటికీ ప్రతిఘటిస్తే ప్రత్యక్షదాడులు చేయడం, అయినప్పటికీ నామినేషన్ కేంద్రంలోకి వెళితే ధ్రువీకరణ పత్రాలు చించేయడం యథేచ్ఛగా నడించింది. ఈ క్రమంలో వీరపునాయునిపల్లె, చింతకొమ్మదిన్నె, కమలాపురం, చెన్నూరు, సింహాద్రిపురం జెడ్పీటీసీ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాక్షాత్తు కలెక్టర్, ఎస్పీ నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న సమ యంలో కూడా పచ్చనేతలు అదే ప్రాంగణంలో గుంపులుగా తిష్టవేసి ఉండడం గమనార్హం.
మహిళమణులపై యథేచ్ఛగా దాడులు...
నిన్న చాపాడులో మానవత్వం మర్చిపోయి నామినేషన్ వేసేందుకు వచ్చిన 8 నెలల గర్భిణీపై దాడి చేసిన తెలుగుతమ్ముళ్లు, శుక్రవారం రక్తగాయాలు అయ్యేలా మహిళలపై రాళ్లు కర్రలతో దాడి చేశారు. శుక్రవారం కలసపాడు మండలం ఎగువ తంబళ్లపల్లె ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన బేబి అనే మహిళపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. తలకు రక్తగాయాలై ఆమె విలవిల్లాడిపోయారు. అయినప్పటికీ ఆమె వద్ద నున్న నామినేషన్ పత్రాలను లాక్కొని చించేశారు. మైలవరం మండల వద్దిరాల ఎంపీటీసీ నామినేషన్ వేసేందుకు వెళ్లిన మహాలక్ష్మి కారు ధ్వంసం చేశారు. నామినేషన్ పత్రాలు లాక్కెళ్లారు. వీరబల్లె మండలంలో ఎంపీటీసీ నామినేషన్ వేసేందుకు వెళ్లిన లక్ష్మిదేవితోపాటు వారి కుమారుడుపై పచ్చమూకలు దాడులకు తెగబడ్డారు. సుండుపల్లెలో మాజీ ఎంపీపీ అజంతమ్మ నామినేషన్ వేసేందుకు వెళ్తుండగా టీడీపీ నేత మహేష్‌నాయుడు బలవంతంగా నామినేషన్ ప్రతాలు తీసుకెళ్లారు. ఇలా ఎక్కడికక్కడ జిల్లా వ్యాప్తంగా మహిళలపై టీడీపీ శ్రేణులు దాడికి ఒడిగట్టారు.
పోలీసులు వ్యూహాత్మక ఎత్తుగడలు...
స్థానిక సంస్థల ఎన్నికలల్లో ఆది నుంచి విలన్లుగా మారిన పోలీసు అధికారులు చివరి రోజు వ్యూహాత్మక ఎత్తుగడలు పాటించారని పలువురు విమర్శిస్తున్నారు. రెండు రోజులుగా వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఎక్కడికక్కడ అడ్డగించడం, ముందస్తు అక్రమ నిర్బంధంలోకి తీసుకోవడం చేసిన పోలీసులు నామినేషన్ల చివరి రోజు మధ్యాహ్నం నుంచి ఎవరైనా నామినేషన్లు వేయాలని ఉంటే రావాలని, రక్షణగా నిలుస్తామని స్వీయ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం గమనార్హం. మరోవైపు జిల్లా కేంద్రంలో సైతం రెండు పర్యాయాలు పోలీసులే జెడ్పీటీసీ అభ్యర్థులను నామినేషన్ కేంద్రంలోకి తరలించారు. ఇవన్నీ పరిశీలిస్తే ఉన్నత న్యాయస్థానాల ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలనే ఎత్తుగడలల్లో భాగంగా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎస్పీలు నచికేత్విశ్వనాథ్, ధీరజ్ కునుబల్లి, డీఐజీ కోయ ప్రవీణ్‌లపై తిరుపతి ఎంపీ గురుమూర్తి సైతం కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఫిర్యాదు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు.
పులివెందులలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ నామినేషన్ పత్రాలను చించివేస్తున్న టీడీపీ మూకలు
నామినేషన్లు వేయనీయకపోవడంతో వేంపల్లెలో బైఠాయించిన వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు
వైఎస్సార్సీపీ నేతలపై, మీడియాపైనే కాకుండా పోలీసులపై కూడా పచ్చమూక దాడులకు పాల్పడ్డారు. జిల్లా పరిషత్ ప్రాంగణంలో సీనియర్ జర్నలిస్టు సుందర్‌పై దాడి చేశారు. ఈఘటనపై మీడియా ప్రతినిధులు రోడ్డుపై బైఠాయించడంతో టీడీపీ నేతలు ఖంగుతిన్నారు. అంతలోనే ప్రాంగణంలో ఉన్న ఓ పోలీసుపై దాడి చేసిన ఘటన తెరపైకి వచ్చింది. ఇలాంటి ఘటనలు జిల్లాలో అక్కడక్కడ తెరపైకి వచ్చాయి. బి.కోడూరులో ఏకంగా ఓ పోలీసు అధికారిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. నామినేషన్ వేయించేందుకు సహకరించారనే నెపంతో దాడి చేయడం విచారకరం.


