కడప రూరల్ : బీజేపీ అభ్యర్థికి కార్పొరేటర్ సీటును ఇచ్చినట్లు ఇచ్చి, నామినేషన్‌కు వెళితే ఇటు టీడీపీ కార్యకర్తలు, అటు పోలీసులు దాడి చేయడం తగదని బీజేపీ నాయకులు అన్నారు. దాడి సంఘటనలో గాయపడిన బాధితుడు కడప నగరం 6వ డివిజన్‌కు చెందిన ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పుట్టిక వెంకటరమణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ న్యాయం కోసం అంబులెన్స్‌లో స్ట్రెచెర్‌పై ఆదివారం సాయంత్రం వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌కు వచ్చారు. ఆ సందర్భంగా ఆ పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పొత్తులో భాగంగా 6వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్ధిగా తమ పార్టీకి చెందిన ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు డాక్టర్ పుట్టిక వెంకటరమణకు కేటాయించామన్నారు. శనివారం నామినేషన్‌కు వెలితే అక్కడ ఉన్న టీడీపీ గూండాలు అడ్డగించి, దాడి చేసి వెనక్కి పంపారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆదేశాల మేరకు తాను వచ్చి, తెలుగుదేశం పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ శ్రీనివాసులురెడ్డిని సంప్రదిస్తే, నామినేషన్ వేసుకోవాలని చెప్పారని తెలిపారు. శనివారం చిన్నచౌక్‌లోని బాలికల హైస్కూల్ వద్దకు నామినేషన్ వేయడానికి వెళితే.. అక్కడ మద్యం మత్తులో ఉన్న టీడీపీ అనుచరులు వెంకటరమణపై దాడికి పాల్పడ్డారన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు బైరెడ్డి మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ మూడు రోజుల నుంచి నామినేషన్ కేంద్రాల వద్ద టీడీపీ దౌర్జన్యకాండను కొనసాగించడం సిగ్గుచేటన్నారు. బరితెగించిన టీడీపీకి బీజేపీ సహకరించరాదన్నారు.
న్యాయం కోసం దీక్ష
బాధితుడు డాక్టర్ పుట్టిక వెంకట రమణ మాట్లాడుతూ 6వ డివిజన్‌కు కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వెళితే తనపై దాడి చేశారన్నారు. పోలీసులు, టీడీపీ నాయకులు ప్రజాస్వామ్యం అపహాస్యం పాలయ్యేలా వ్యవహరించారన్నారు. దాడి సంఘటనతో తాను అనారోగ్యంగా ఉన్నప్పటికీ న్యాయం కోసం సోమవారం నుంచి కలెక్టరేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు చేవూరి శారద, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నామినేషన్‌కు వెళితే గాయపరిచారు
సమావేశంలో బీజేపీ నేతలు


