● డ్రైవర్లతో సహా పలువురికి గాయాలు
మైదుకూరు : మైదుకూరు పరిధిలోని రాయప్పగారిపల్లెకు సమీపంలో బుధవారం సాయంత్రం బళ్లారి – కృష్ణపట్నం జాతీయ రహదారిపై టిప్పర్ – ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో డ్రైవర్లతో సహా బస్సులోని పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. మైదుకూరు డిపోకు చెందిన బద్వేలు – మైదుకూరు సర్వీస్ బస్సు మైదుకూరుకు వస్తోంది. ఓ నిర్మాణ సంస్థకు చెందిన టిప్పర్ గడ్డంవారిపల్లె వద్దకు వెళ్తోంది. రాయప్పపల్లెకు సమీపంలోని బ్రిడ్జి వద్ద ఎడమవైపు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సును డ్రైవర్ కుడి వైపునకు మళ్లించాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ బస్సు ఢీకొన్నాయి. సంఘటనలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పాలకిట్టి శ్రీనివాసులు (59), టిప్పర్ డ్రైవర్ బాలకృష్ణ (46), బస్సులోని బద్వేలుకు చెందిన ఎర్రబల్లి పరంజ్యోతి (33), ఆమె కుమారుడు వంశీధర్ (11), కుమార్తె యశస్విని (8), మైదుకూరుకు చెదిన సంపత్ కుమార్ (46) మరికొందరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో చికిత్స కోసం మైదుకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. టిప్పర్ డ్రైవర్ బాలకృష్ణ కాళ్లు క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో జేసీబీతో క్యాబిన్‌ను తొలగించి అతడిని బయటకు తీశారు. బస్సు డ్రైవర్ శ్రీనివాసులను మెరుగైన చికిత్స కోసం ప్రొద్దుటూరుకు రెఫర్ చేశారు. మైదుకూరు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వెదురు బొంగుల పట్టివేత
ముద్దనూరు: మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న వెదురు బొంగులను అటవీశాఖ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల జిల్లా అహోబిలం ప్రాంతం నుంచి పులివెందులకు ఎలాంటి అనుమతులు లేకుండా మూడు ఆటోలలో వెదురు బొంగులను తరలిస్తుండగా.. పులివెందుల రహదారిపై అధికారులు తనిఖీలు చేసి పట్టుకున్నారు. వెదురు బొంగులతో పాటు మూడు ఆటోలను సీజ్ చేసి రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి(ఎఫ్‌ఆర్వో) శ్రీనివాసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామని, చట్టప్రకారం అపరాధ రుసుము విధించనున్నట్లు ఎఫ్‌ఆర్వో పేర్కొన్నారు.


