● వైఎస్సార్ కడప, అన్నమయ్య రెండూ
‘జనరల్’ కేటగిరీయే
● సీటు కోసం పోటీ తీవ్రం
సాక్షి, కడప ప్రతినిధి: రాష్ట్రంలోని జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పదవులకు రిజర్వేషన్ ఖరారు చేస్తూ మంగళవారం ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా వైఎస్సార్ కడప, అన్నమయ్య జెడ్పీ చైర్మన్ పదవులను అన్ రిజర్వ్డుగా ప్రకటించింది. జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మన్ల పదవి జనరల్ కేటగిరీలో రావడంతో ఆయా జిల్లాల రాజకీయాలు రసవత్తరం కానున్నాయి. పోటీ చేసే ఆశావాహుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది. కాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 19 మండలాలు, ఉమ్మడి కడప జిల్లాలోని ఆరు మండలాలతో కలిపి 2025 డిసెంబర్ 30న అన్నమయ్య జిల్లాను పునర్విభజన చేశారు. 25 మండలాలతో జిల్లా పరిషత్ ఏర్పడింది. మదనపల్లె కేంద్రంగా గత నెల 25న జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ప్రారంభించారు. పూర్తిస్థాయిలో కార్యాలయం సిద్ధమయ్యాక కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.


