అడవిలో మళ్లీ అలజడి | - | Sakshi
Sakshi News home page

అడవిలో మళ్లీ అలజడి

Oct 14 2026 1:47 AM | Updated on Oct 14 2026 1:47 AM

ఖాజీపేట : చాలా కాలంగా ఎర్రచందనం దొంగలు అడవిలోకి వెళ్లక పోవడంతో అంతా ప్రశాంతంగా కనిపించింది. తాజాగా రెండు నెలలుగా ఎర్రచందనం కోసం అధిక శాతం కూలీలు అడవిలోకి వెళ్తున్నారు. అక్రమ రవాణాకు పెద్ద ఎత్తున తెరలేపారు. అటవీ శాఖ అధికారులు, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఎంత నిఘా ఉంచినా.. నిఘాను దాటి ఎర్రచందనం అక్రమ రవాణా చేసుకు పోతున్నారు. దీనికి పూర్తి స్థాయిలో ఇటు ఫారెస్ట్‌ అధికారులు గానీ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గానీ అడ్డుకట్ట వేయలేక పోతున్నారు. తాజాగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, అటవీశాఖ అధికారులు దాడుల్లో పెద్ద ఎత్తున వాహనాలను అదుపులోకి తీసుకోవడమే కాకుండా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో.. అడవుల్లో అలజడి కొనసాగుతోందని తెలుస్తోంది.

తమిళ కూలీలు

ఖాజీపేట మండల పరిధిలోని నాగసానిపల్లె చెరువు నుంచి చెన్నముక్కపల్లె గ్రామం వరకు, అలాగే జాండ్లవరం బీట్‌ పరిధిలో నాగసానిపల్లె నుంచి బసాపరం టోల్‌ప్లాజా వరకు విశాలమైన అటవీ ప్రాంతం ఉంది. అక్కడ నుంచి తరచూ తమిళ కూలీలతోపాటు స్థానిక ఎర్రచందనం అక్రమ రవాణా దారులు కలిసి వివిధ రవాణా మార్గాల ద్వారా చేరుకుని అడవుల్లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. గతంలో వందల మంది తమిళ కూలీలు అడవుల్లోకి వెళ్లేవారు. ప్రస్తుతం 10 నుంచి 20 మంది వరకు విడతల వారీగా వెళ్తున్నట్లు సమాచారం. అందుకు స్థానికులు పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. అలా వచ్చిన వారు అడవిలో సుమారు 16 కిలోమీటర్ల వరకు వెళ్లి.. జాండ్లవరం బీట్‌, నాగసానిపల్లె బీట్‌ పరిధి దాటి లోపలికి వెళ్లి దుంగలను తీసుకు వస్తున్నట్లు సమాచారం.

ట్రాన్స్‌ఫోర్ట్‌కు అనుకూలం

ఖాజీపేట మండల పరిధిలోని అటవీ ప్రాంతం రవాణాకు అనుకూలంగా ఉంటోంది. అడవిలో నుంచి తెచ్చిన దుంగలను రవాణా చేసేందుకు వారు అటవీ ప్రాంతానికి దగ్గరల్లోనే దాచిపెడుతున్నట్లు సమాచారం. వాటిని తమకు అనుకూలమైన సమయం చూసి వివిధ రకాలైన వాహనాల్లో.. క్షణాల్లో లోడ్‌ చేసుకుని ప్రధాన రహదారి మీదుగా దర్జాగా వెళ్తున్నారు. అటవీ ప్రాంతం నుంచి ప్రధాన రహదారులకు సుమారు 5 కిలోమీటర్ల కంటే తక్కవ ఉన్నందున, అలాగే రాత్రి వేళల్లో సిద్దవటం పరిధిలో పూర్తి రవాణా రాకపోకలు లేనందున స్మగ్లర్లు ఈ ప్రాంతం నుంచి రవాణాకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. జాతీయ రహదారి అంతా పూర్తిగా బైపాస్‌ ఉండటం స్మగ్లర్లకు బాగా కలిసి వస్తోంది. జాతీయ రహదారి పైకి రోడ్డు మార్గంలో రవాణాకు అడ్డదార్లు అధికంగా ఉన్నందున ఎక్కువ శాతం స్మగ్లర్లు రవాణాకు ఇక్కడ నుంచే తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

నిఘాను దాటుకుని..

ఎర్రచందనం రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది గట్టి నిఘా ఉంచారు. ఎర్రచందనం స్మగ్లర్ల కదలికల నుంచి తమిళ కూలీల రాకపోకలపై ప్రత్యేక నిఘా ఉంచారు. వారి కదలికలను ఎప్పటికప్పడు తెలుసుకుంటూ దాడులు చేస్తూనే ఉన్నారు. కానీ నిఘాను దాటుకుని ఎర్రచందనం అక్రమ రవాణాకు స్మగ్లర్లు పాల్పడుతున్నారు. అడవిలోకి వెల్లిన తమిళ కూలీలు స్థానిక కూలీలు కలిసి చెట్లను నరికి, వాటిని దుంగలుగా కట్‌ చేసి అడవి సమీపంలో ఉంచి వెళ్లిపోవడం జరుగుతుంది. తరువాత రవాణా అంతా స్థానిక స్మగ్లర్లు చూసుకుంటారు. ఇటీవల కాలంలో ఈ రవాణా బాగా పెరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మైదుకూరు పరిధిలోని జాండ్లవరం బీట్‌, నాగసానిపల్లె పరిధిలో అధికంగా జరుగుతోంది.

టాస్క్‌ఫోర్స్‌, ఫారెస్ట్‌ అధికారుల దాడులు

ఇటీవల కాలంలో నాగసానిపల్లె, జాండ్లవరం బీట్‌ పరిధిలో భారీగా వాహనాలు పట్టుకుంటున్నారు. ఎర్రచందనం దుంగలను రవాణా చేసేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో దాడులు చేసి పట్టుకుంటున్నారు. అలా దాడులు చేయగా డస్టర్‌ కారుతోపాటు ఒక లారీని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఇతియోస్‌ వాహనంలో తమిళ కూలీలను అడవిలో దించి తిరుగు ప్రయాణంలో ఉన్న వాహనాన్ని ఫారెస్ట్‌ అధికారులు అతి కష్టం మీద వెంబడించి పట్టుకున్నారు. ఇలా సుమారు 90 దుంగల ను వివిధ కేసుల్లో పట్టుకుని నమోదు చేశారు.

స్థానికులే కీలకం

తమిళనాడు నుంచి వచ్చిన కూలీలను అడవిలోకి పంపడం.. వారు తెచ్చిన దుంగలను వాహనాల్లోకి ఎక్కించి రవాణా చేయడంలో స్థానికులే కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఫారెస్ట్‌ అధికారులు దాడులు చేస్తే.. వారిని చూసి వాహనాలను వదిలి స్మగ్లర్లు పరారవుతున్నారు. అలా ఇప్పటికే చాలా మందిపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల తోపాటు ఫారెస్ట్‌ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోకపోతే స్మగ్లర్లను అరికట్టడం సాధ్యం కాదని స్థానికులు అంటున్నారు.

వేధిస్తున్న సిబ్బంది కొరత

ఖాజీపేట మండలంలో ప్రధానంగా అటవీశాఖ అధికారులను సిబ్బంది కొరత వేధిస్తోంది. ప్రతి బీట్‌ పరిధిలో ఇద్దరు ఉండాల్సి ఉండగా.. కేవలం ఒక్కరికే పరిమితమయ్యారు. 10 మంది పని చేయాల్సిన చోట ఐదుగురు మాత్రమే పని చేయడం అటవీశాఖ అధికారులకు తలకు మించిన భారంగా మారింది. గతంలో బేస్‌ క్యాంప్‌లు అధికంగా ఉండేవి. అందులో సిబ్బంది అక్కడే ఉండేవారు. బేస్‌ క్యాంపులను అటవీశాఖ అధికారులు తొలగించడం కూడా స్మగ్లర్లకు బాగా కలసి వస్తోంది.

జూలు విదుల్చుతున్న ఎర్రచందనం దొంగలు

స్థానికుల సహకారంతోనే అక్రమ రవాణా

ఇటీవల భారీగా పట్టుబడటంతో

వెలుగులోకి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement