స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం

Oct 14 2026 1:47 AM | Updated on Oct 14 2026 1:47 AM

● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

పి.రవీంద్రనాథ్‌రెడ్డి

బద్వేలు అర్బన్‌ : త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా సమష్టిగా పని చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మరోసారి బద్వేలు మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయాలని పేర్కొన్నారు. మంగళవారం స్థానిక నెల్లూరు రోడ్డులోని రాచపూడి నాగభూషణం ఫంక్షన్‌ హాలులో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ సుధ, నియోజకవర్గ యువ నాయకుడు దేవసాని ఆదిత్యరెడ్డితో కలిసి నిర్వహించిన మున్సిపాలిటీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం వరకు బద్వేలు ప్రాంత ప్రజానీకానికి వైఎస్‌ కుటుంబంతో విడదీయలేని అనుబంధం ఉందని అన్నారు. కార్యకర్తల నిరంతర కృషి, ప్రజల ఆదరణతో గడిచిన 20 ఏళ్లుగా బద్వేలు నియోజకవర్గంలో పార్టీ బలమైన పునాదులు ఏర్పరచుకుందని అన్నారు. ఎన్నో రాజకీయ ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ పార్టీ శ్రేణులంతా ఐకమత్యంగా ముందుకు సాగాయని, అదే స్ఫూర్తితో రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కరూ పార్టీ అభ్యర్థుల విజయానికి కష్టపడి పనిచేయాలని సూచించారు.

పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు

బద్వేలు మున్సిపాలిటీగా ఏర్పడిన నాటి నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో మాత్రమే బద్వేలు మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ సుధ పేర్కొన్నారు. బద్వేలులో ఆర్డీఓ కార్యాలయం, రూ.110 కోట్లతో బృహత్తర తాగునీటి పథకం, బద్వేలు మున్సిపాలిటీకి నూతన కార్యాలయం, మూడు అర్బన్‌ హెల్త్‌సెంటర్లు, పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలతోపాటు పట్టణ సుందరీకరణ వంటి ఎన్నో కార్యక్రమాలను ప్రజలకు వివరించి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో ఎదురయ్యే రాజకీయ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలని, పార్టీ నాయకత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు.

బద్వేలు గడ్డ.. వైఎస్సార్‌సీపీ అడ్డా

బద్వేలు గడ్డ వైఎస్సార్‌సీపీ అడ్డా అని, ఈ ప్రాంత ప్రజలతో వైఎస్‌ కుటుంబానికి ఉన్న అనుబంధం ఎప్పటికీ చెక్కుచెదరదని నియోజకవర్గ యువ నాయకుడు, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యరెడ్డి పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో 40 వార్డుల్లో పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కలిసికట్టుగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. గడిచిన రెండున్నరేళ్ల కాలంలో కూటమి నేతలు చేసిన అణచివేసే ప్రయత్నాలకు గట్టిగా సమాధానం ఇవ్వాలంటే.. రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజల మద్దతును కూడగట్టి వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేయాలని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్తకు, నాయకుడికి అందుబాటులో ఉంటూ వారికి గుర్తింపు, గౌరవం లభించేలా పని చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే ప్రతి నాయకుడి, కార్యకర్త కృషిని పార్టీ తప్పక గుర్తిస్తుందని భరోసా కల్పించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ బూత్‌కన్వీనర్ల సమన్వయకర్త కె.రమణారెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రాజగోపాల్‌రెడ్డి, మాజీ కుడా చైర్మన్‌ గురుమోహన్‌, మాజీ మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ ఆర్‌.వి.సాయిక్రిష్ణ, వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల రాష్ట్ర, జిల్లా నాయకులు బంగారుశీనయ్య, అల్లాబకాష్‌, యద్దారెడ్డి, పుత్తాశ్రీరాములు, రమేష్‌బాబు, ఎంఆర్‌ఎఫ్‌ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement