పట్టా భూమిలో.. ‘పవర్‌’ పాలిటిక్స్‌! | - | Sakshi
Sakshi News home page

పట్టా భూమిలో.. ‘పవర్‌’ పాలిటిక్స్‌!

Oct 14 2026 1:47 AM | Updated on Oct 14 2026 1:47 AM

పట్టా భూమిలో.. ‘పవర్‌’ పాలిటిక్స్‌!

కడప రూరల్‌ : ప్రభుత్వమే నాడు నిరుపేదలకు అండగా ఉంటూ జీవనోపాధి కోసం డీ–పట్టాలు ఇచ్చింది. ఆ నమ్మకంతోనే సదరు బాధితులు అక్కడ రెక్కల కష్టాన్ని నమ్ముకుని చిన్న ఆశల గూడు నిర్మించుకున్నారు. ఏళ్ల తరబడి అక్కడే నివాసం ఉంటున్నారు. అయితే, ఇప్పుడు ఆ పేదల పొట్ట కొట్టేలా అదే స్థలంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మించేందుకు అధికారులు సన్నాహాలు చేయడం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆశల గూడు కూలిపోతుందనే భయంతో బాధితులు ఆందోళన బాట పట్టారు. వివరాల్లోకి వెళితే.. మోడ పోతుల చంద్రమ్మ అనే మహిళ 1992 నుంచి కడప జిల్లా చిన్నచౌక్‌ గ్రామ పంచాయతీలోని మృత్యుంజయ కుంటలో సర్వే నంబర్‌ 754–1 పరిధిలోకి వచ్చే 2 సెంట్ల స్థలంలో ఒక పూరి గుడిసె నిర్మించుకొని నివాసం ఉండేది. ఇద్దరు ఆడపిల్లలతో ఆమె పడుతున్న కష్టాలు విన్న ఓ తహసీల్దారు 2002 జనవరి 4న కరుణించారు. ఆమె ఉంటున్న స్థలంలోనే ఆమెకు డీ పట్టా అందించారు. ఆ భరోసాతో కష్టపడి తన బిడ్డలను చదివించుకుంటూ కాలం గడిపిన చంద్రమ్మ... ఆ ప్రదేశంలో ఓ పెంకుటిల్లు నిర్మించుకున్నారు. మునిసిపల్‌ అధికారులకు ఇంటి పన్ను(అసెస్మెంటు నంబరు 1013039972), కుళాయి పన్ను కట్టారు. విద్యుత్తు అధికారులను అడిగి కరెంటు మీటరు ఇప్పించుకొని కరెంటు బిల్లు కూడా కట్టారు. జీవితం అలా సాగిపోయింది.

పెద్దల కన్ను

ఇప్పుడు ప్రభుత్వ పెద్దలకు ఆ స్థలంపై కన్ను పడింది. విలువైన స్థలం కావడంతో, ఆమె ఇంట్లో లేని సమయంలో చొరబడి, దశాబ్దాలుగా ఉంటున్న పెంకుటిల్లును కూలగొట్టారు. లబోదిబోమన్న చంద్రమ్మ, కలెక్టర్‌, తహసీల్దారు, మునిసిపల్‌ కమిషనర్‌ ల చుట్టూ తిరిగి మొర పెట్టుకుంది. ఆ ఇల్లు లేకపోతే జీవనమే లేదని కాళ్లావేళ్లా పడింది. అధికారులు వినిపించుకోలేదు. ఆమెది ఆ స్థలం కాదంటూ బుకాయించారు. సర్వే నంబరు ఆమెది కాదని, ఆమె 34 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇల్లు తనది కాదని వాదించారు. చేసేది లేక చంద్రమ్మ కోర్టును ఆశ్రయించారు. కోర్టు.. అలా ఎలా, ఉన్న ఇంటిని కూల్చివేస్తారని ప్రశ్నించింది. హైకోర్టు స్టే విధించింది. అధికారులు పట్టించుకోలేదు. 2025లో స్థలంలోకి వచ్చి పనులు చేస్తామని బుల్డోజర్లతో వచ్చారు. చంద్రమ్మ మళ్లీ కోర్టులో మొరపెట్టుకున్నారు. కోర్టు కంటెప్ట్‌ ఆఫ్‌ కోర్టు అని అధికారులకు నోటీసులిచ్చింది. అయినా అధికారులు పెడచెవిన పెట్టారు. విద్యుత్తు సబ్‌ స్టేషన్‌ కట్టాలని ప్రతిపాదించారు. ప్రజాప్రతినిధులే కాంట్రాక్టర్లు అయితే.. ఏ పనైనా ఆగమేఘాల మీద సాగిపోతుంది.

ఎమ్మెల్యేను నిలదీసిన బాధితులు

స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ప్రోత్సాహంతో మంగళవారం సాయంత్రం ఆ స్థలంలో విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జోనల్‌ ఇన్‌చార్జ్‌ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థలాలను కోల్పోయే ప్రమాదం ఉన్న మరి కొంత మంది బాధితులు ఎమ్మెల్యే మాధవిరెడ్డిని కలిశారు. నీడ లేకుండా చేస్తున్నారని నిలదీశారు.

ఆశల గూడు కూలిపోతుందంటూ పేదల కన్నీరు

సబ్‌స్టేషన్‌ నిర్మాణాన్ని అడ్డుకున్న స్థానికులు

న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి

మాకు న్యాయం చేయాలి

ఈ స్థలమే మాకు జీవనాధారం. ఈ స్థలం లేకపోతే మా కుటుంబం రోడ్డున పడాల్సి వస్తుంది. స్థానిక పోలీస్‌ స్టేషన్లో కూడా మా ఫిర్యాదును స్వీకరించలేదు. ఎస్సీ వర్గానికి చెందిన మాకు న్యాయం చేయాలి.

– చంద్రమ్మ, కడప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement