కడప సిటీ : ప్రముఖ సినీ నటుడు, క్రామేడ్ కల్యాణ్ ఫేమ్ శ్రీవిష్ణు మంగళవారం రాత్రి కడప పెద్దదర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తన కడప పర్యటనలో భాగంగా ఆయన దర్గాకు చేరుకోగా, దర్గా నిర్వాహకులు సాదర స్వాగతం పలికి దర్గా సంప్రదాయమైన తలపాగా చుట్టి దర్గా గురువుల దర్శనం చేయించారు. తొలుత ఆయన దర్గాలోని హజరత్ పీరుల్లామాలిక్ మజార్‌ను దర్శించుకోగా, అనంతరం దర్గా ఆవరణలోని ఇతర గురువుల మజార్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, భక్తులు పాల్గొన్నారు.
ప్రొద్దుటూరులో సందడి
ప్రొద్దుటూరు క్రైం : ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘కామ్రేడ్ కళ్యాణ్’ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చిత్ర కథానాయకుడు శ్రీవిష్ణు అన్నారు. ప్రొద్దుటూరులోని అమీర్ సినిమా థియేటర్‌లో హీరో శ్రీవిష్ణుతోపాటు చిత్ర యూనిట్ సందర్శించింది. ఈ సందర్భంగా శ్రీ విష్ణు మాట్లాడుతూ ప్రేక్షకుల ఆదరణ, అభిమానమే చిత్ర విజయానికి ప్రధాన కారణమని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం హీరో విష్ణు కేక్ కట్ చేసి అభిమానులతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో అమీర్ థియేటర్ యాజమాన్య ప్రతినిధులు అమీర్ బాషా, ఫైరోజ్, జాకీర్, గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు.


