పులివెందుల టౌన్ : దివ్యధామం, మహిమాన్విత క్షేత్రం పులివెందుల శ్రీరంగనాథస్వామి ఆలయమని కేరళ ప్రముఖ సిద్ధాంతి డీఎస్ మహేంద్ర కుమార్ పేర్కొన్నారు. పులివెందులలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ క్షేత్రంలో అష్ట మంగళ కార్యక్రమం, దైవ ప్రశ్న పూజా కార్యక్రమాల నిర్వహణకు కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం నుంచి రావడం జరిగిందన్నారు. ఈ ఆలయం చరిత్ర ఎంతో గొప్పదని, విజయనగర సామ్రాజ్య కాలం నుంచి వైభవంగా నడిచిందన్నారు. భారతదేశంలోని తిరుచిలో గల శ్రీరంగం, కర్ణాటక రాష్ట్రంలోని శ్రీరంగ పట్టణం ఆలయాల వలే ఎంతో ఉజ్వలంగా ప్రకాశించిందన్నారు. ఈ ఆలయంలో భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలో జరిగిన వివిధ ప్రముఖ సంఘటనలను రాశి చక్రం ద్వారా తెలుసుకున్నామన్నారు. అడ్డంకులు, సమస్యలు తొలగించేందుకు తాము అధ్యయనం చేశామని, వాటికి సరైన పరిహారం తెలియజేస్తామన్నారు. అనంతరం ఆయనను పులివెందులకు చెందిన ఆర్యవైశ్య నాయకులు, దినేష్ మెడికల్స్ అధినేత మేడం దినేష్ కుమార్, ఈవో రమణ, శ్రీ రంగనాథ ట్రస్ట్ సీఈవో అల్లం రంగనాయకులు రాయల్, చల్లా వంశస్తులు ఆరవేటి నారాయణరెడ్డి తదితరులు సన్మానించి శ్రీవెంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని అందజేశారు.


