ఎల్‌నినో ప్రభావంతో...
● ఖరీఫ్ ముగుస్తున్నా సూక్ష్మసేద్యపరికరాలు అందించని సర్కారు
● ఆందోళన కలిగిస్తున్న దుర్భిక్షం....
సాగుపై తీవ్ర ప్రభావం
● జిల్లాలో 10600 హెక్టార్లకు కేవలం 376 హెక్టార్లకే డ్రిప్ సౌకర్యం
కడప అగ్రికల్చర్: రైతుల సంక్షేమంపై సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉండదని మరోసారి రుజువైంది. ఖరీఫ్ ప్రారంభంలో పడిన అరకొర వానకు రైతులు అక్కడక్కడ పంటలు సాగు చేశారు. ఆపై వరుణుడు కరుణించకపోవడంతో పంటలు ఎండుముఖం పట్టాయి. అసలే వర్షాభావ పరిస్థితులు.. ఆపై బోర్లలో నీరు అడుగంటడంతో ఆరుతడి పంటను కాపాడుకునేందుకు రైతు తీవ్ర అవస్థలు పడుతున్నాడు. అదే సీజన్ ప్రారంభంలోనే రైతులకు కావాల్సిన బిందు, తుంపర సేద్య పరికరాలను అందించి ఉంటే పంటలను కాపాడుకునే వీలుండేది. కూటమి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించలేదు. కాగా జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 56,867.50 ఎకరాల్లో(22747హెక్టార్లు) ఆరుతడి పంటలైన పత్తి, వేరుశనగ, మినుము, కంది, జొన్న, సజ్జ, మొక్కజొన్న పంటలను రైతులు సాగు చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే చాలా చోట్లు బోర్లలో నీరు తగ్గి సాగు చేసిన ఆరుతడి పంటలు వాడుముఖం పట్టాయి. ఇంకొన్ని చోట్లు బోర్లలో అరకొరగా నీరు వస్తున్నా ఎండల తీవ్రత దృష్ట్యా పంట పొలాలకు నీటి తడులను అందించడం కష్టతరంగా మారుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సకాలంలో సూక్ష్మ సేద్య పరికరాలు
అందించి ఉంటే..
సూక్ష్మ సాగు పథకం కింద జిల్లావ్యాప్తంగా 2026–27 సంవత్సరానికి 10,600 హెక్టార్లలో బిందు, తుంపర సేద్యం పరికరాలు ఏర్పాటు చేయాలని ఏపీఎంఐపీ లక్ష్యంగా నిర్ణయించింది. ఖరీఫ్ సీజన్ ముగిసినా ఇప్పటికి కేవలం జిల్లాలో 376 హెక్టార్లలో మాత్రమే బిందు, తుంపర సేద్య పరికరాలను ఏర్పాటు చేశారు. కనీసం రబీ సీజన్‌కై నా బిందు, తుంపర పరిరకాలను ఏర్పాటు చేసి పంటలసాగుకు సహకరించాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.
డ్రిప్ కోసం పోటాపోటీ
తక్కువ నీటి ఖర్చుతో అధిక విస్తీర్ణంలో పంటలు సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. దీనికి బిందు, తుంపర పరికరాలు రైతులకు చాలా అవసరం. ప్రభుత్వం వీటిని 90శాతం రాయితీతో రైతులకు అందిస్తోంది. ఏటా రైతులు వీటిని మంజూరు చేయించుకునేందుకు వేల సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటారు. బిందు, తుంపర నీటి పరికరాల కోసం జిల్లాలో ఈ ఏడాది 8718 మంది రైతులు 10906 హెక్టార్లకు ఆన్ లైన్ ద్వారా తమ దరఖాస్తులను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 4740 మంది రైతులకు సంబంధించి ప్రాథమిక సర్వే పూర్తి చేశారు. వీరిలో పథకం లబ్ధి పొందేందుకు 10శాతం వాటా సొమ్మును 2393 మంది రైతులు డీడీలు చెల్లించారు. వీరిలో 2105 మంది రైతులకు సంబంధించి 2510 హెక్టార్లకు బిందు, తుంపర సేద్య పరికరాల ఏర్పాటుకు కలెక్టర్ నుంచి పరిపాలన ఉత్తర్వులు పొందారు. వీరిలో ఇప్పటి వరకు కేవలం 376 మంది రైతులకే బిందు, తుంపర సేద్య పరకరాలను ఏర్పాటు చేశారు.
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, భూగర్భజలాలపై ఆందోళనతో బిందు, తుంపర సేద్య పరికరాల ఏర్పాటుకు రైతులు అంతగా అసక్తి చూపలేదు. దీనికితోడు కొన్ని కంపెనీలకు పరికరాల ఏర్పాటుకు అనుమతులు రాకపోవడంతో కొంత ఆలస్యం జరిగింది. ప్రస్తుతం సూక్ష్మనీటి సేద్యం పరికరాల కోసం దరఖాస్తు చేసుకుని ఎంపిక చేసిన రైతులకు బిందు, తుంపర సేద్య పరికరాలను ఏర్పాటు చేస్తున్నాం. వీలైనంత త్వరగా పథకానికి ఎంపికై న ప్రతి రైతుకు సూక్ష్మనీటి పరికరాలను అందిస్తాం.
– బి.వి. రమణ, పీడీ, ఏపీఎంఐపీ


