ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్
కడప అర్బన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక – పీజీఆర్‌ఎస్’ కార్యక్రమంలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వివిధ సమస్యలపై మొత్తం 146 ఫిర్యాదులు అందాయి. ప్రతి ఫిర్యాదును స్వయంగా పరిశీలించిన ఎస్పీ, సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యల వివరాలను తెలుసుకున్నారు. ఫిర్యాదులపై చట్టపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా నిష్పక్షపాతంగా విచారణ పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను పోలీస్ శాఖ దృష్టికి తీసుకురావాలని, చట్ట పరిధిలో పరిష్కరించగల ప్రతి ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలోఅడిషనల్ ఎస్పీ (అడ్మిన్)కె. ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్పీ ఎన్. సుధాకర్, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.


