బద్వేలు అర్బన్ : బద్వేలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగలు తారాస్థాయికి చేరాయి. తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్న నాయకులను, కార్యకర్తలను ఆ పార్టీ బద్వేలు నియోజకవర్గ కొత్త బాస్ దూరం పెట్టడంతో పాటు కొందరిపై కక్ష సాఽధింపు చర్యలకు పాల్పడుతుండటాన్ని ఆ పార్టీ సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు సోమవారం పట్టణంలోని టీడీపీ సీనియర్ నాయకులు ఏపీఐఐసీ డైరెక్టర్ వర్ధిపోయినప్రసాద్‌రెడ్డి కార్యాలయంలో నియోజకవర్గస్థాయి సూర్యనారాయణరెడ్డి వ్యతిరేక వర్గం సమావేశం నిర్వహించింది.
సీనియర్లను విస్మరిస్తున్నారని ఆవేదన
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తున్న సీనియర్ నాయకులను టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి సూర్యనారాయణరెడ్డి విస్మరిస్తూ ఇటీవల పార్టీలో చేరిన వారికి పెద్దపీట వేస్తున్నారని సమావేశంలో కొందరు సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా గతంలో ఉన్న మండల కమిటీలు, క్లస్టర్ ఇన్‌ఛార్జిలకు సమాచారం ఇవ్వకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ఇతర పార్టీల వారిని టీడీపీలోకి చేర్చుకోవడం, స్థానిక నేతలకు సమాచారం లేకుండానే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటుండటం వంటి అంశాలపై సమావేశంలో తీవ్రస్థాయిలో చర్చించినట్లు సమాచారం.
5 రోజుల్లో భారీ సమావేశం
బద్వేలు నియోజకవర్గ కొత్త ఇన్‌ఛార్జి సూర్యనారాయణరెడ్డి అవలంబిస్తున్న ఏకపక్ష విధానాలు, కక్ష సాధింపు చర్యలపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే క్రమంలో ఈ నెల 26 లేదా 27న కార్యకర్తల ఆవేదన సభ పేరుతో బద్వేలులో పది వేల మందితో నియోజకవర్గస్థాయి భారీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆ సభలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని సమావేశంలో తీర్మానించినట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని పార్టీ అధినేత ప్రతి సందర్భంలో చెబుతున్నా బద్వేలులో మాత్రం సొంత పార్టీ కార్యకర్తలనే ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కార్యకర్తలను విస్మరిస్తే పార్టీకి భవిష్యత్తు ఉండదనే విషయాన్ని అధిష్టానం గుర్తించేలా సమావేశం నిర్వహించాలని సమావేశానికి హాజరైన పార్టీ సీనియర్ నాయకులు స్పష్టం చేసినట్లు సమాచారం.
బద్వేలు టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి జ్వాల
సూర్యనారాయణరెడ్డి వ్యతిరేక వర్గం
సమావేశం
భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయం


