– మైలవరంలో అత్యధికంగా
25.4 మి.మీ వర్షం
కడప అగ్రికల్చర్: జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజు పలు మండలాల్లో వర్షం కురిసింది. ఇందులో భాగంగా మైలవరంలో అత్యధికంగా 25.4 మి.మీ వర్షం కురిసింది. అలాగే నందలూరులో 23, బి. కోడూరులో 18, ముద్దనూరులో 15.8, సింహాద్రిపురంలో 14.2, కొండాపురంలో 13.2, పోరుమామిళ్ల, తొండూరులలలో 10.2, కమలాపురంలో 9.4, జమ్మలమడుగులో 8.4, లింగాల, ప్రొద్దుటూరులలో 8.2 , వేంపల్లిలో 6.2, దువ్వూరులో 3.4, కాశినాయనలలో 3.2, చాపాడులో 2.8, రాజుపాలెం, ఒంటిమిట్టలో 2.6, బి.మఠంలో 1.8, పెద్దముడియంలో 1.6, అట్లూరులో 0.8 మి.మీ వర్షం కురిసింది.
హానర్స్‌లో
ప్రవేశాలకు ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వ విద్యాలయం పరిధిలోని అన్ని యాజమాన్య కళాశాలలో డిగ్రీ మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న విద్యార్థులకు 4వ సంవత్సరం హానర్స్‌లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ప్రిన్సిపల్ జె. వెంకట లక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హతలు కలిగిన విద్యార్థులు ఈ నెల 22 నుంచి 28 తేదీల్లోపు తమ ఒరిజినల్ సర్టిఫికెట్‌లతో 9491112150, 9441689606 నంబర్స్‌లో సంప్రదించాలని సూచించారు.
24 నుంచి పవిత్రోత్సవాలు
కడప సిటీ : కడప నగర పరిధిలోని దేవునికడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. 23న సాయంత్రం పుణ్యాహవచనం, మత్స్యంగ్రహణం, అంకురార్పణ జరుగుతుంది. 24న ఉదయం చతుష్టార్చాన, అగ్ని ప్రతిష్ట, పవిత్ర ప్రతిష్ట, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 25న పవిత్ర సమర్పణ, 26న పూర్ణాహుతి, పవిత్ర వితరణ, స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు జరగనుంది. ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ఏటా మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
దరఖాస్తుల ఆహ్వానం
కడప రూరల్ : ఆశా కార్యకర్తల పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ యుగంధర్ తెలిపారు. కమ్యూనిటీ ప్రాసెస్ పథకంలో భాగంగా జిల్లాలో గ్రామీణ(రూరల్) ప్రాంతాల్లో 27, పట్టణ (అర్బన్) ప్రాంతాల్లో 11, మొత్తం 38 ఆశ కార్యకర్తల నియామకాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన మహి ళా అభ్యర్తులు పూర్తి చేసిన తమ దరఖాస్తులను ఈ నెల 23 నుంచి 26వ తేదీ లోపు సంబంధిత ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలలో, స్వర్ణ గ్రామా (సచివాలయం) లలో అందజేయాలన్నారు. దరఖాస్తులు, ఖాళీల వివరాల కోసం ఆయా ప్రాంత ప్రాథమిక కేంద్రం, పట్టణ ఆరోగ్య కేంద్రాలలో మెడికల్ ఆఫీసర్‌ని సంప్రదించాలని తెలిపారు. దరఖాస్తు పూర్తి వివరాలకు కడప.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్ సైట్ ను సంప్రదించాలని సూచించారు.
25 మంది ఎంపిక
కడప ఎడ్యుకేషన్: కడప ప్రభుత్వ డీఎల్‌టీసీ ఐటీఐలో సోమవారం నిర్వహించిన ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళాలో 25 మంది ఎంపికయ్యారని ఐటీఐల జిల్లా కన్వీనర్ జ్ఞానకుమార్ తెలిపారు. ఈ అప్రెంటిస్‌షిప్ మేళాలో పది పరిశ్రమల ప్రతినిధులు పాల్గొని శిక్షణకు అవసరమైన ఎంపిక చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 67 మంది విద్యార్థులు పాల్గొనగా అందులో 25 మంది విద్యార్థులను అప్రెంటిస్ మేళాకు ఎంపిక చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లాలో మద్యం దుకాణాల రెన్యువల్స్
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: జిల్లాలో 83 మద్యం దుకాణాలు రెన్యువల్ అయినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. జిల్లాలో 141 మద్యం దుకాణాల గాను 83 మద్యం దుకాణాలు అయ్యాయని వీటి ద్వారా రూ. 3.901కోట్లు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. కడప నగరంలో 22 మద్యం దుకాణాలకు గాను 19 రెన్యూవల్స్ అయ్యాయి.


