● పీఆర్ ఈఈ ఆఫీసే జెడ్పీ కార్యాలయం
● కడప, చిత్తూరు ఉద్యోగుల సర్దుబాటు
సాక్షి, మదనపల్లె : మదనపల్లె జిల్లా కేంద్రంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాకు నూతన జిల్లా పరిషత్ ఏర్పాటుకు అంతా సిద్ధమైంది. ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటికే రెండు జీవోలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మదనపల్లె కేంద్రంగా జిల్లా పరిషత్‌ను ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. 2022 ఏప్రిల్ 4న రాయచోటి కేంద్రంగా 30 మండలాలతో అన్నమయ్య జిల్లా ఏర్పడింది. కూటమి ప్రభుత్వం వచ్చాక 2025 డిసెంబర్ 30న మదనపల్లె జిల్లా కేంద్రంగా, 25 మండలాలతో అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేసింది. దీంతో ఈ జిల్లాకు జెడ్పీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటిదాకా ఉమ్మడి జిల్లాల పరిధిలోనే జిల్లా పరిషత్ పాలన సాగుతోంది. రాయచోటి వైఎస్సార్‌కడప, మిగిలినవి చిత్తూరు జిల్లా పరిషత్‌లలో కొనసాగుతున్నాయి. కాగా జిల్లా పరిషత్ పాలకవర్గ పదవీకాలం ఈనెల 24తో ముగియనుంది. 25 నుంచి అధికారుల పాలనలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో గడువులోపు విభజన ప్రక్రియ పూర్తి చేయొచ్చన్న భావనలో ప్రభుత్వం ఉంది.
ఈఈ ఆఫీసులో జెడ్పీ కార్యాలయం
ఉమ్మడి చిత్తూరు నుంచి విభజన జరిగే అన్నమయ్య జిల్లా పరిషత్ కార్యాలయాన్ని మదనపల్లె పంచాయతీరాజ్ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని తాత్కాలికంగా నిర్ణయించారు. దీనికి సంబంధించిన చర్యలు ప్రారంభించారు. అన్నమయ్య జిల్లా పరిషత్ ఏర్పాటుకు సంబంధించి ఉద్యోగుల సర్దుబాటు కూడా చేస్తున్నారు. ఉమ్మడి కడపలోని రాయచోటి అన్నమయ్యలోకి, ఉమ్మడి చిత్తూరులోని పీలేరు, మదనపల్లె తంబళ్లపల్లె పుంగనూరు నియోజకవర్గాలు ఉన్నాయి. దీంతో చిత్తూరు జిల్లా పరిషత్, కడప జిల్లా పరిషత్ నుంచి ఉద్యోగులను అన్నమయ్య జిల్లా పరిషత్‌కు కేటాయించే అవకాశం ఉంది. దీనికోసం సర్దుబాటు చర్యలు చేపట్టారు. ఇక్కడికి వచ్చేందుకు సుముఖంగా ఉన్న అధికారులు, ఉద్యోగుల వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. అలాగే ఇక్కడ తరలించాల్సిన రికార్డుల విభజన పని చేపట్టినట్టు సమాచారం.
నేడో, రేపో నియామకం
అన్నమయ్య జిల్లా పరిషత్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల నియామకాన్ని ప్రభుత్వం సోమ లేదా మంగళవారం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని జెడ్పీ వర్గాలు తెలిపాయిు. ఈ అధికారుల నియామకం అయ్యాక జెడ్పీ పాలన అధికారికంగా ప్రారంభం కానుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా జిల్లా పరిషత్ ను పూర్తిస్థాయిలో సిద్ధం చేయడానికి చర్యలు తీసుకుంటారు. అధికారుల హోదాకు తగ్గ ఏర్పాట్లను కార్యాలయంలో చేయాల్సి ఉంది. రికార్డులను తరలించడం, వాటిని భద్రపరచడం, ఇక్కడికి నియమితులైన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవడం..తదితర చర్యలను ఎన్నికల నిర్వహణలోపే పూర్తి చేసేందుకు కసరత్తు చేసే అవకాశం ఉంది.


