● అధికారులకు పట్టని ప్రయాణికుల కష్టాలు
● కోవిడ్–19 ముందు హాల్టింగ్స్‌కు మంగళం
● పునరుద్ధరించకపోవడంతో ప్రయాణికులకు ఇక్కట్లు
రాజంపేట : కోవిడ్‌కు ముందు రద్దయిన రైళ్లు నేటికీ పట్టాలు ఎక్కలేదు. నడిచే పలు రైళ్లకు హాల్టింగ్ లేదు. దీంతో జిల్లా రైల్వేపరంగా ప్రసిద్ది చెందిన నందలూరు, తిరుపతి జిల్లాలోని ఓబులవారిపల్లె జంక్షన్ పరిధిలోని ప్రయాణికులు ఏళ్లతరబడి అవస్థలు పడుతున్నారు. గుత్తి–రేణిగుంట రైలుమార్గంలో ఎర్రగుంట్ల, కడప, నందలూరు, రాజంపేట, ఓబులవారిపల్లె, రైల్వేకోడూరు రైల్వేస్టేషన్లు ప్రాధాన్యత కలిగినవి. ఈ ప్రాంతవాసులతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు ఈ స్టేషన్ల ద్వారా పలు రైళ్లలో రోజూ వేలాదిమంది ప్రయాణిస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన రైల్వేస్టేషన్లలో స్టాపింగ్‌లేక ఏళ్ల తరబడి ప్రయాణికులు అవస్థలు పడుతున్నా రైల్వేబోడ్డు, రైల్వే ఉన్నతాధికారులు అసలు పట్టించుకోవడంలేదన్న విమర్శలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం నంద్యాల–రేణిగుంట, తిరుపతి–హుబ్లీ, అరక్కోణం–కడప ప్యాసింజర్ రైళ్లు తప్ప ఈ మార్గంలో మిగిలిన ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులో లేకుండాపోయాయి. అందుకు కారణం కోవిడ్ –19 రైళ్ల హాల్టింగ్స్‌ను పునరుద్ధరించకపోవడమే.
పునరుద్ధరిస్తే మేలు..
● గతంలో ప్రయాణికుల ఆదరణ చూరగొని రైల్వేశాఖకు ఆదాయం సమకూర్చిన రైళ్లను పునరుద్ధరిస్తే అందరికీ మేలు. ముఖ్యంగా చిన్నస్టేషన్ల ప్రయాణికుల కష్టాలు తీరుతాయి. ప్రస్తుతం ఇవి నడవక ప్రయాణికు ల జర్నీ ఇబ్బందిగా మారింది. అద్దె వాహనాలను ఆశ్రయించి అధిక వ్యయప్రయాసలకు లోనవుతున్నారు.
● కడప–తిరుపతి మధ్య ఒకప్పుడు రెండు ప్యాసింజర్ రైళ్లు ఉండేవి. ఇవి సామాన్య ప్రయాణికుల రాకపోకలకు అనువుగా ఉండేవి. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీలు నిత్యం కిటకిటమంటుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రయాణికులు ప్యాసింజర్ రైళ్లు అనుకూలంగా ఉంటాయి. అలాగే కడప–గుంతకల్(డివిజన్ కేంద్రానికి) వెళ్లే మార్గంలో ప్యాసింజర్ రైలు అందుబాటులోకి వస్తే పల్లెస్టేషన్లలోకి వెళ్లేందుకు ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుది.
● ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి రైల్లో వెళ్లాలంటే తెల్లవారుజామున స్టేషన్లలో ఉండాల్సిన పరిస్థితి. ఈ మార్గంలో నడిచే చాలా ఎక్స్‌ప్రెస్ రైళ్లు సమయ వేళలు తెల్లవారుజామునే ఉన్నాయి. దీంతో ప్యాసింజర్ రైళ్లను టైమింగ్స్ మార్చి నడిపిస్తే జిల్లా ప్రయాణికులకు కొంత ఉపశమనం కలుగుతుంది. అలాగే ఉద్యోగులు, రైల్వేకార్మికులు, రిటైర్డ్ కార్మికులు, విద్యార్ధులు, నిరుద్యోగులు అటూ తిరుపతి, చిత్తూరు, రేణిగుంట, చైన్నె సరిహద్దు స్టేషన్ల్‌కు వెళ్లేందుకు వీలుగా ఉంటుంది.
● సదరన్ రైల్వేలో ఉన్నప్పటి నుంచి నందలూరు రైల్వేకేంద్రానికి తమిళులు ఎక్కువగా రాకపోకలు సాగించేవారు. కొందరు అరవపల్లె అనే ప్రాంతంలో స్థిరపడ్డారు.ఈ ప్రాంతంలో రైల్వేకార్మికులు, సాఫ్ట్‌వేర్స్, వ్యాపారులు, ఉద్యోగులు ఉన్నారు. అలాగే అరక్కోణం, పుత్తూరు, పెరంబూరు తదిత రైల్వేస్టేషన్‌ల పరిధిలో నందలూరు కు చెందిన వారు వేలాదిమంది ఉన్నారు. ప్యాసింజర్ రైళ్లు లేక రాకపోకలకు వీరు ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు మెయిల్, టెన్‌మెయిల్ (రాత్రిపూట), లెవన్, ట్వువల్ ఎక్‌ప్రెస్ రైళ్లు నడిచేవి. కోవిడ్–19లో వీటి వేళలు మార్చడంతో ఇబ్బందులు పడుతున్నారు.
● జిల్లాలోని కడప, నందలూరు, రైల్వేకోడూరు, కమలాపురం, బద్వేలు తదితర ప్రాంతంలో సాప్ట్‌వేర్స్‌తోపాటు బెంగళూరుకు రాకపోకలు అధికంగా ఉన్నాయి. జిల్లా నుంచి డైరక్ట్‌గా కడప నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు వెళ్లేందుకు ఒక్క రైలు కూడా అందుబాటులో లేదు. ఇప్పటికై నా రైల్వే ఉన్నతాధికారులు ఈ మార్గాల్లో ప్యాసింజర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.
రైలుప్రయాణికుల పక్షాన విన్నవించాం
గుత్తి–రేణిగుంట మార్గంలో ప్రాథాన్యత కలిగిన స్టేషన్లలో ఆగని రైళ్ల గురించి ఎప్పుటికప్పుడు విన్నవిస్తున్నాం. ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి, మేడా రఘునాథరెడ్డిలు దృష్టికి తీసుకెళ్లాను. ఇప్పటికే కొన్ని రైళ్లకు కొన్ని రైల్వేస్టేషన్ రైళ్లో ఆగేలా చర్యలు తీసుకున్నారు. కోవిడ్–19 ముందు ఏవిధంగా రైళ్ల హాల్టింగ్ ఉండేవే, వాటిని పునరుద్ధరించాలని కోరాం. ఆ ప్రయత్నమే వైఎస్సార్‌సీపీ ఎంపీలు కృషిచేస్తున్నారు.
–తల్లెం భరత్‌కుమార్‌రెడ్డి, డీఆర్‌యూసీ సభ్యుడు, రైల్వేకోడూరు


