మెగా డీఎస్సీ కాదు మేనేజ్‌మెంట్‌ డీఎస్సీ | - | Sakshi
Sakshi News home page

మెగా డీఎస్సీ కాదు మేనేజ్‌మెంట్‌ డీఎస్సీ

Sep 7 2026 3:02 AM | Updated on Sep 7 2026 3:02 AM

ప్రొద్దుటూరు : డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్రమంతా కోడై కూస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం తన క్యాంప్‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇంత అధ్వానంగా ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి డీఎస్సీ ఉద్యోగాలను భర్తీ చేయలేదన్నారు. అక్రమాలకు, అవినీతికి పాల్పడి టీచర్‌ ఉద్యోగాలను అంగట్లో సరుకులా అమ్ముకున్నారని ఆరోపించారు.

ఎంత మంది ప్రశ్నించినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని, దున్నపోతు మీద వాన పడి చందంగా పట్టించుకోవడం లేదన్నారు. కర్నూలుకు చెందిన ప్రభాకర్‌ గౌడ్‌, వైఎస్సార్‌ జిల్లాకు చెందిన అమ్మాయి లాంటి సాక్ష్యాధారాలు వెలుగు చూసినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో డీఎస్సీలో జరిగిన అక్రమాలు వెలుగు చూస్తున్నాయన్నారు. డీఎస్సీలో అక్రమాలు జరగలేదని గతంలో పది మార్లు చెప్పడంతోపాటు ఛాలెంజ్‌ చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్‌ ఇప్పుడు తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారన్నారు. ఒక్కో ఉద్యోగాన్ని రూ.15 లక్షల నుంచి రూ.20లక్షలకు అమ్ముకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. డీఎస్సీలో అవినీతి, అక్రమాలు వెలుగు చూస్తున్నా నైతిక బాధ్యతతో పదవికి రాజీనామా చేయకుండా విద్యాశాఖ మంత్రి లోకేష్‌ పదవీవ్యామోహంతో గబ్బిలంలా పట్టుకుని వేలాడుతున్నట్లు విమర్శించారు. ఈ అక్రమాలపై యువత జెన్‌జీ లాంటి ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. యువత బయటికి వచ్చి పోరాటం చేయకపోతే భవిష్యత్తులో నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. తన కుమారుడిని ముఖ్యమంత్రిగా చేయాలని చంద్రబాబు కుటుంబ సభ్యులు కలలు కంటున్నారని, ఆయనే ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని మూడు దుడ్లకు అమ్ముతారన్నారు. ప్రజలు ఓట్లు వేయకుండానే తండ్రి ముఖ్యమంతి అయ్యారని, ఆటలు ఆడని వారిని క్రీడాకారులను చేశారని, చదువు రాని వారిని అయ్యవార్లను చేశారని విమర్శించారు. బాగా చదువుకున్న వారు నష్టపోయారని తెలిపారు. జూడో, సాఫ్ట్‌బాల్‌, లాంటి క్రీడలకు సంబంధించి ఎమ్మెల్యే కూన రవి లాంటి వారిని ప్రతినిధిగా నియమిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు, దివ్యాంగుల కోటాకు సంబంధించి దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని తెలిపారు. వినికిడి లోపం ఉందని వైఎస్సార్‌ జిల్లాకు సంబంధించిన అమ్మాయి ఉద్యోగం సాధించిందన్నారు. దివ్యాంగుల కోటాకు సంబంధించి నకిలీ ధ్రువపత్రాలను సృష్టించారని, వెనకబడిన తరగతుల వారికి సంబంధించి ఫేక్‌ సర్టిఫికెట్లు తయారు చేశారన్నారు. ఒకే గ్రామంలో ఏడు మందికి ఉద్యోగాలు రావడం, ఒకే ఇంట్లో భార్యభర్తలు ఉద్యోగాలు సాధించడం జరిగిందన్నారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపి మళ్లీ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. నిజంగా శ్రీచరణి, సింధూలాంటి క్రీడాకారులకు ఉద్యోగాలు ఇస్తే తప్పు లేదని క్రీడాకారులు కాని వారికి దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఇంతకంటే నీచం మరొకటి ఉంటుందా అని ప్రశ్నించారు. ఇది మెరిట్‌ డీఎస్సీ కాదని మేనేజ్‌మెంట్‌ డీఎస్సీ అని, మెరిట్‌ లిస్ట్‌ కాదు మనీ లిస్ట్‌కే ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారన్నారు. డీఎస్సీ రిక్రూట్‌ మెంట్‌ సమయంలో ఉన్న ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేశారని, ప్రస్తుతం అదే స్థానంలో ఉన్న వారు డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి పత్రికా ప్రకటన ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. అదే స్థానంలో ఐఏఎస్‌ అధికారులు ఈ అక్రమాలకు తమకు సంబంధం లేదని చెబుతుంటే, బదిలీ అయిన వారు ఆ స్థానంలో లేమని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని స్వయానా కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థ ముఖ్యమంత్రి చంద్రబాబును హెచ్చరించినట్లు విశ్వసనీయంగా తెలిసిందన్నారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

రాచమల్లు శివప్రసాదరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement