వేముల : టైలింగ్ పాండ్‌తో తీవ్రంగా నష్టపోయామని.. న్యాయం చేయాలని కె.కె.కొట్టాల గ్రామస్తులు బుధవారం టైలింగ్ పాండ్ వద్ద నిరసన తెలిపారు. మండలంలోని కె.కె.కొట్టాల గ్రామం వద్ద యురేనియం వ్యర్థ పదార్థాలను తరలించేందుకు టైలింగ్ పాండ్ నిర్మించారు. ఈ టైలింగ్ పాండ్ నిండేస్థాయికి చేరడంతో ఎత్తు పెంచేందుకు యూసీఐఎల్ నిర్ణయించింది. దీంతో కె.కె.కొట్టాల గ్రామస్తులు టైలింగ్ పాండ్ ఎత్తు పెంచేందుకు నిరాకరిస్తూ నిరసన తెలిపారు. గతంలో టైలింగ్ పాండ్ వ్యర్థాలతో వ్యవసాయ బోర్లు కలుషితమై పంటలు పండటంలేదని గ్రామస్తులు ఆరోపించారు. గతంలో ఒకసారి టైలింగ్ పాండ్ ఎత్తు పెంచాలని నిర్ణయించడంతో గ్రామస్తులు టైలింగ్ పాండ్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో యురేనియం అధికారులు గ్రామస్తులతో చర్చించి ఎత్తు పెంచుకునేందుకు వారిని అంగీకరింపజేసి పనులు చేశారు. అప్పట్లో కె.కె.కొట్టాల గ్రామాన్ని ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద తీసుకుని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారి భూములకు మెరుగైన పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆరు నెలలు గడిచినా యురేనియం అధికారులు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని గ్రామస్తులు వాపోయారు. యురేనియం టెండర్లను రద్దు చేయాలని, న్యాయం జరగకపోతే టైలింగ్ పాండ్ పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు.


