నియోజకవర్గాల వారిగా యూనిట్లు, దరఖాస్తులు..
ప్రభుత్వ అనుమతుల కోసం వేచి ఉన్నాము
● రాయితీ యంత్రాల కోసం జిల్లా వ్యాప్తంగా 4,900 మంది రైతుల నిరీక్షణ
● జేసీ లాటరీ, ఇన్‌చార్జ్ మంత్రి సంతకం నిబంధనలతో నిలిచిన ఎంపిక ప్రక్రియ
● రూ.4.78 కోట్లున్నా ఫైళ్లను
కదపని కూటమి ప్రభుత్వం
● ప్రభుత్వ అనుమతుల కోసం వేచి ఉన్నామంటున్న వ్యవసాయశాఖ అధికారి
కడప అగ్రికల్చర్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలోని అన్నదాతలకు కష్టాలతో పాటు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. రైతులను ఏ కోశానా ఆదుకోని ఈ సర్కారు.. ఇన్‌పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం, పంటలకు మద్దతు ధర కల్పించడం వంటి అన్ని విషయాల్లోనూ రైతులకు ఘోర అన్యాయమే చేస్తోంది. తాజాగా సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ కింద సబ్సిడీతో కూడిన వ్యవసాయ యంత్రీకరణ పథకాన్ని ప్రకటించినప్పటికీ, దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయకుండా పూర్తిగా గాలికొదిలేయడంపై రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
నిబంధనల వల.. ఎప్పుడో ముగిసిన దరఖాస్తు ప్రక్రియ
రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలను పొందే రైతులకు ప్రభుత్వం పలు కఠిన నిబంధనలను విధించింది. లబ్ధిదారులకు స్వంత భూమి ఉండటంతో పాటు, కనీసం మూడు సార్లు ఈ–పంట రికార్డులలో నమోదు చేయించి ఉండాలి. గతంలో ఎప్పుడూ ప్రభుత్వం నుండి ఇలాంటి సబ్సిడీలు పొంది ఉండకూడదు. ఈ నిబంధనల ప్రకారం భూమి రికార్డులను సమర్పించిన రైతుల ఆన్‌లైన్ దరఖాస్తులను సంయుక్త కలెక్టర్ స్వయంగా లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయాల్సి ఉంటుంది. అలా ఎంపికై న అర్హుల జాబితాపై జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సంతకం చేసిన తర్వాత పదిహేను రోజులకు సబ్సిడీ మొత్తం రైతుల ఖాతాల్లో జమ అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఎప్పుడో పూర్తయినప్పటికీ ఇంతవరకు రాయితీ ట్రాక్టర్లు, యంత్ర పరికరాలను ఇవ్వకపోవడంపై రైతులు వాపోతున్నారు.
రూ.4.78 కోట్ల నిధులున్నా కదలని ఫైళ్లు!
వ్యవసాయ యంత్రీకరణ పథకంలో భాగంగా ప్రస్తుత సంవత్సరానికి సబ్సిడీ ట్రాక్టర్లు, ట్రాక్టర్ పనిముట్లు, స్ప్రేయర్లు, మినీ ట్రాక్టర్లు ఇలా తొమ్మిది రకాల యంత్రాలు మరియు పరికరాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జిల్లా కోటా కింద 1333 యూనిట్లకు రాయితీగా రూ.4.78 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇందులో ఇతరులు మరియు జనరల్ కోటాకు రూ.2,36,28,000, షెడ్యూల్డ్ కులాల కోటాకు రూ.81,26,000, షెడ్యూల్డ్ తెగల కోటాకు రూ.33,46,000లను కేటాయించారు. ఈ నిధుల కోసం మే నెలలోనే 4,900 మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు.
ట్రాకర్ల గోర్లు
నియోజకవర్గం యూనిట్లు దరఖాస్తులు
కడప 06 02
మైదుకూరు 208 864
పొద్దుటూరు 106 462
జమ్మలమడుగు 300 1286
కమలాపురం, 205 675
పులివెందుల 317 945
బద్వేల్ 96 372
రాజంపేట 95 294
మొత్తం 1333 4900
జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ యంత్రీకరణ పథకానికి సంబంధించి రైతుల నుండి వచ్చిన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. ఈ లబ్ధిదారుల ఎంపిక మరియు లాటరీ నిర్వహణకు సంబంధించి ప్రస్తుతం మేము ఉన్నతాధికారుల నుండి వచ్చే ప్రభుత్వ అను మతుల కోసం వేచి ఉన్నాము. అనుమతులు మరియు ఆదేశాలు రాగానే తదుపరి చర్యలు చేపట్టి, జిల్లా వ్యాప్తంగా సబ్సిడీ యంత్రాల పంపిణీ కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేస్తాము. – మట్టా సుబ్రమణేశ్వరావు,
వ్యవసాయశాఖ జిల్లా అధికారి, కడప.
ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడుస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఇరవై ఐదు వేల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. సాగు పనుల ప్రారంభంలోనే వ్యవసాయ పనులు చేసుకునేందుకు వీలుగా సబ్సిడీ యంత్రాలను అందజేసి ఉంటే బాగుండేదని రైతులు అంటున్నారు. సాగు పనులకు యంత్రాలు ఎంతో అవసరమైన ప్రస్తుత సమయంలో పనిముట్లను ఇవ్వకుండా, సీజన్ అంతా ముగిసిపోయిన తర్వాత ఇస్తే తమకేం లాభమని అన్నదాతలు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికై నా కూటమి సర్కార్ స్పందించి వెంటనే సబ్సిడీ ట్రాక్టర్లు, యంత్రాలను అందజేయాలని రైతులు కోరుతున్నారు.


