బొప్పాపురంలో దా‘రుణం’ | - | Sakshi
Sakshi News home page

బొప్పాపురంలో దా‘రుణం’

Aug 26 2026 12:42 AM | Updated on Aug 26 2026 12:42 AM

భార్య, కూతురు, అల్లుడే కొట్టి చంపేశారు!

అప్పుల గొడవలే కారణమా? ఆస్తి కోసమే ఘాతుకమా?

పోరుమామిళ్ల : వైఎస్సార్‌ కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలో జరిగిన కాకర్ల బాలయ్య (57) అనుమానాస్పద మృతి ఉదంతం వెనుక అత్యంత దారుణమైన హత్య కుట్ర, ఆర్థిక వివాదాలు దాగి ఉన్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో బయటపడుతోంది. మంగళవారం ఉదయం తీవ్ర గాయాలతో ఉన్న ఆయన భౌతికకాయాన్ని తెలంగాణాకు చెందిన ఒక అంబులెన్స్‌లో తీసుకొచ్చి పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో దించి అపరిచితులు జారుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘాతుకం వెనుక భార్య, కూతురు, అల్లుడే ఉన్నారని తల్లి కొండమ్మ, బొప్పాపురం గ్రామస్తులు సాక్ష్యాలతో సహా స్పష్టం చేస్తుండగా.. అల్లుడిని కాపాడేందుకు తెరవెనుక పెద్ద ఎత్తున రాజకీయ శక్తులు రంగంలోకి దిగడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

బెంగళూరు మెస్‌ నష్టాలు..

అప్పుల కోణంలోనే దాడి!

స్థానికులు మరియు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. బొప్పాపురం గ్రామానికి చెందిన బాలయ్య గతంలో బెంగళూరు నగరంలో ఒక పీజీ (మెస్‌) నిర్వహించి తీవ్రంగా నష్టపోయాడు. దీనికి తోడు కొన్ని దురలవాట్ల వల్ల భారీగా అప్పులు చేశాడు. బాలయ్య చేసిన అప్పుల కారణంగా తమకున్న కుటుంబ ఆస్తి మొత్తం హారతి కర్పూరంలా కరిగిపోతుందనే తీవ్ర బాధ, ఆందోళనతోనే భార్య లక్ష్మిదేవి, కూతురు కృష్ణకుమారి, అల్లుడు అబ్బయ్యలు శనివారం ఆయనను ఇంట్లోకి తీసుకెళ్లి తలుపులు వేసి పదునైన ఆయుధంతో దారుణంగా కొట్టారని తల్లి కొండమ్మ కన్నీళ్లతో వివరించింది. దెబ్బల తీవ్రతకు బాలయ్య తల పగిలి చెవుల నుండి రక్తం విపరీతంగా కారడంతో, సాక్ష్యాలు మాయం చేయడానికి రక్తపు బట్టలను నిందితులు అక్కడికక్కడే తగులబెట్టారు. ఈ హత్యకు ఆర్థిక వివాదాలతో పాటు అక్రమ సంబంధం కోణం కూడా కారణమై ఉండవచ్చని మరొక కథనం జనంలో బలంగా చక్కర్లు కొడుతోంది.

హైదరాబాద్‌కు తరలింపు..

సాక్ష్యాల మాయాజాలం

దాడి అనంతరం శనివారం పోరుమామిళ్ల ఆసుపత్రికి తీసుకెళ్లగా.. డాక్టర్లు కడపకు తీసుకెళ్లమని చెప్పారు. అయితే నిందితులు కడపకు వెళ్లకుండా తిరిగి ఇంటికే తెచ్చి పడేశారు. ఆదివారం ఉదయం బాలయ్య పరిస్థితి మరింత విషమించడంతో రహస్యంగా కడపకు తరలించారు. ఆ తర్వాత అక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్లారో ఎవరికీ సమాచారం ఇవ్వలేదు. అయితే, మంగళవారం శవాన్ని మోసుకొచ్చిన అంబులెన్స్‌ తెలంగాణ రిజిస్ట్రేషన్‌తో ఉండటంతో.. నిందితులు కేసు నుంచి తప్పించుకోవడానికి ఆదివారమే బాలయ్యను హైదరాబాద్‌కు తరలించారని బంధువులు చెబుతున్నారు. అక్కడ సోమవారం ఆయన చనిపోవడంతో శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా మంగళవారం ఇక్కడ తెచ్చి పడేశారని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రి ఆవరణలో భార్య, కూతురు, అల్లుడు ఎవరూ కనిపించలేదు. వారు పోలీసుల అదుపులో ఉన్నారా లేక పరారయ్యారా అనే గందరగోళం నెలకొంది.

అల్లుడిని కాపాడేందుకు ‘రాజకీయ’ తపన

ఈ దారుణ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అల్లుడు అబ్బయ్యను ఎలాగైనా రక్షించి, ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు లేకుండా చేసేందుకు తెరవెనుక ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని మృతుని బంధువులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. అబ్బయ్య ఈ మండలంలోని కొట్టాలపల్లె గ్రామానికి చెందినవాడు కావడం, పైగా ఆయన ఒక బ్యాంకు ఉద్యోగి కావడంతో.. ఈ మచ్చ పడితే ఉద్యోగం ఊడిపోతుందనే తాపత్రయంతో మండలంలోని కొందరు ముఖ్య కూటమి రాజకీయ నాయకులు రంగంలోకి దిగి ఆయనను కాపాడేందుకు పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement