పులివెందుల: పులివెందుల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగిన బృహత్తర అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకునేందుకు కూటమి ప్రభుత్వం దారుణమైన క్రెడిట్ చోరీకి పాల్పడుతోందని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 299 గ్రామాలకు తాగునీరిచ్చే 480 కోట్ల రూపాయల రూరల్ వాటర్ గ్రిడ్, పట్టణ సమస్య తీర్చే 60 కోట్ల రూపాయల అర్బన్ ప్రాజెక్టుకు 2021 జూన్‌లో శ్రీకారం చుట్టి, తన హయాంలోనే 90 శాతానికి పైగా మేజర్ పనులను పూర్తి చేశారు. కూటమి ప్ర భుత్వం ఏర్పడి రెండున్నరేళ్లుగా ఈ పనులను పూర్తిగా పట్టించుకోకుండా కాలయాపన చేసి, ప్రస్తుతం చేసిన చిన్నపాటి మైనర్ పనులను చూపిస్తూ తామేదో పూర్తి చేసినట్లు ఎల్లో మీడియా వేదికగా ఆర్బాటాలు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో మొదటి దశలోనే పార్నపల్లి వద్ద అత్యాధునిక నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు, ప్రత్యేక విద్యుత్ ఉపకేంద్రం మరియు 25 కిలో మీటర్ల మేర విద్యుత్ లైన్ పనులను పూర్తి చేశారు. 1,175 కిలోమీటర్ల పైపులైన్‌కు 1,089 కిలోమీటర్ల మేర పైపులు వేయడంతో పాటు, అవసరమయ్యే 225 ప్ర ధాన నిర్మాణాలలో ఏకంగా 204 పనులను వంద శా తం పూర్తి చేశారు. అలాగే, పట్టణ తాగునీటి ప్రాజెక్టు కింద ఐదు భారీ ట్యాంకర్లకు గానూ మూడు ట్యాంకర్ల నిర్మాణం నాడే వంద శాతం సంపూర్తి కాగా, మిగిలిన రెండు ట్యాంకర్ల పనులు కూడా 75 శాతం పూర్తయ్యా యి. కేవలం ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికీ తాగునీరు అందుతుంది. గత వైఎస్సార్‌సీపీ హయాంలో దాదాపు 300 కోట్ల రూపాయల మేర పనులను కాంట్రాక్టర్ పూర్తి చేయగా, కూటమి ప్రభుత్వం వచ్చాక నిధుల విడుదలలో తీవ్ర జాప్యం చేస్తూ ప్రస్తుత 2026 సంవత్సరం వరకు నిధులు నిలిపివేసింది. చివరకు జలజీవన్ మిషన్ కేంద్ర నిధుల నిలిపివేతపై కేంద్రం గట్టిగా మొట్టికాయలు వేయడంతో దిగివచ్చి అరకొర కనెక్షన్, టెస్టింగ్ పనులు పూర్తి చేసి కవరింగ్ ఇచ్చుకుంటోంది.
మరోవైపు, పులివెందుల నియోజకవర్గంలో పేదలకు వైద్యం అందించాలనే దృఢ సంకల్పంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ నిర్మించగా, భవనాల నిర్మాణం 80 శాతం నాడే పూర్తయింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ 50 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేసినా.. పులివెందులపై కక్షతో కళాశాల నిర్వహించలేమంటూ ఎన్‌ఎంసీకి చంద్రబాబు నాయుడు లేఖ రాసి ఆ సీట్లను వెనక్కి పంపడం దారుణమని ప్రజలంటున్నారు. అలాగే, అరటి రైతుల కోసం వైఎస్ జగన్ హయాంలో 25 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునికంగా నిర్మించిన బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్‌ను కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తాళాలు వేసి మూలనపడేయడంపై రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
వాటర్ గ్రిడ్ పనులకు రూ.500 కోట్లు కేటాయించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
పనులను రెండేళ్లకు పైగా అటకెక్కించి.. అరకొర పనులతో కూటమి ఆర్భాటాలు
మెడికల్ కాలేజీకి మంజూరైన 50 సీట్లను వెనక్కి పంపిన బాబు సర్కార్
చిత్రావతి రిజర్వాయర్ నుండి పల్లెలకు, పట్టణానికి తాగునీరు నిలిపివేసికక్ష
అరటి రైతుల కోసం రూ.25 కోట్లతో కట్టిన బనానా ప్యాక్ హౌస్ మూత


