● పరస్పర ఆరోపణలతో ఉద్రిక్తత
● ఉపాధ్యాయినిని బదిలీ చేయాలని
తల్లిదండ్రుల ఆందోళన
రాజంపేట టౌన్ : రాజంపేట మండలం గుండ్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం ఇరు వర్గాల పరస్పర ఆరోపణలతో తీవ్రస్థాయిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాఠశాలలో హిందీ ఉపాధ్యాయినిగా పని చేస్తున్న ప్రశాంతి వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాఠశాల ప్రధాన సింహద్వార గేటుకు తాళాలు వేసి నిరసనకు దిగారు. క్లాసు రూముల్లో ఉన్న విద్యార్థులను, ఇతర ఉపాధ్యాయులను బయటకు పంపించి గేటు బయట ధర్నా చేపట్టారు. విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. హిందీ ఉపాధ్యాయిని ప్రశాంతి గత కొంతకాలంగా విద్యార్థులను క్లాసు రూముల్లో తీవ్రంగా మందలించడంతో పాటు అసభ్య పదజాలంతో దూషిస్తోందని ఆరోపించారు. ఏడో తరగతి చదువుతున్న షేక్ సనా అనే విద్యార్థిని పెన్సిల్ కిందపడితే తిట్టడం, తొమ్మిదో తరగతి చదువుతున్న మహిధర్ అనే విద్యార్థి అత్యవసరంగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ అనుమతి ఇవ్వకుండా అవమానించడంపై వారు మండిపడ్డారు. విద్యార్థుల ముందే వారి కన్నవారిని ఉద్దేశించి వికృత వ్యాఖ్యలు చేస్తుండటంతో తమ ఆగ్రహం కట్టలు తెంచుకుందని, ఈ విషయమై మంగళవారం ఉదయం హెడ్‌మాస్టర్ సుచరితకు ఫిర్యాదు చేశామని వారు తెలిపారు.
సమావేశంలో ఘర్షణ.. హెడ్‌మాస్టర్ ఆవేదన
తల్లిదండ్రుల ఫిర్యాదుతో హెడ్‌మాస్టర్ సుచరిత అత్యవసరంగా ఉపాధ్యాయులందరితో అంతర్గత సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి రావడానికి ప్రశాంతి నిరాకరించడంతో, తరగతి గదిలో ఉన్న ఆమెను పిలిచేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో అఫ్సనా అనే విద్యార్థిని తల్లి హీరా చేతికి ప్రశాంతి గోళ్ల వల్ల చిన్నపాటి రక్తపు గాయాలయ్యాయి. ఈ ఘటనపై హెడ్‌మాస్టర్ సుచరిత మాట్లాడుతూ.. ప్రశాంతి వల్ల పాఠశాలలో ప్రతిరోజూ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుందని, తోటి ఉపాధ్యాయులతో పాటు తనపై ఆమె కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ఆమె వల్ల తనకు ప్రాణగండం కూడా పొంచి ఉందని ఆరోపించారు.
నన్ను చంపడానికి కత్తెర తెచ్చారు :
ఈ ఆరోపణలన్నింటినీ హిందీ ఉపాధ్యాయిని ప్రశాంతి తీవ్రంగా ఖండించారు. హెడ్‌మాస్టర్ సుచరిత, తోటి ఉపాధ్యాయులే వ్యక్తిగత కక్షలతో తనపైకి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఉసిగొల్పి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఏడో తరగతి చదువుతున్న షేక్ సనా అనే విద్యార్థినితో హెడ్‌మాస్టర్ అత్యంత సన్నిహితంగా ఉంటూ.. ఆ చిన్నారితోనే తనను చంపించే ప్రయత్నం కూడా చేయించారని సంచలన ఆరోపణ చేశారు. ఇందుకు నిదర్శనంగా సోమవారం తరగతి గదిలోకి సదరు విద్యార్థిని సనా కత్తెర తీసుకొచ్చిందని, తనపై భౌతిక దాడి చేసి ప్రాణాలు తీయడానికే ఆ చిన్నారి క్లాస్ రూమ్‌లోకి కత్తెర తెచ్చిందని, దీని వెనుక పెద్దల హస్తం ఉందని ప్రశాంతి స్పష్టం చేశారు.
న్యాయవాది చొరవతో సద్దుమణిగిన వివాదం
పాఠశాల ఆవరణలోనే ఇలా ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు స్కూల్ ప్రధాన గేటుకు తాళాలు వేసి బదిలీ చేయాలంటూ భీష్మించారు. సమాచారం అందుకున్న మండల విద్యాశాఖాధికారి సుబ్బరాయుడు హుటాహుటిన హైస్కూల్ వద్దకు చేరుకుని సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది సుదర్శన్‌రెడ్డి చొరవ తీసుకొని రంగంలోకి దిగారు. ఉపాధ్యాయిని ప్రశాంతి ప్రవర్తనపై, అలాగే ఆమె చేసిన ఆరోపణలపై ఉన్నతాధికారులతో మాట్లాడి నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామని, బదిలీకి చర్యలు తీసుకుంటామని ఆయన గట్టి హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు తల్లిదండ్రులు శాంతించి పాఠశాల తాళాలు తీశారు. అనంతరం ఇరువర్గాల వాదనలపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ ఎంఈఓ సుబ్బరాయుడుకు వినతిపత్రం సమర్పించారు.


