కడప అర్బన్ : కడపలోని రామాంజనేయపురం, దండోరా కాలనీకి చెందిన హారిక (22 )ను, తన తల్లి ఓబుళమ్మను సిద్దవటం పరిధిలో కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే దారుణంగా హత్య చేయడం, తన మరదలు అయ్యవారమ్మపై హత్యాయత్నానికి పాల్పడిన సంఘటనల్లో నిందితుడైన చెవిటివాండ్ల బాబు(45)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి మూడు సెల్‌ఫోన్‌లను, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం కడపలోని జిల్లా పోలీసు కార్యాలయంలోని ‘పెన్నార్ కాన్ఫరెన్స్’హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ వివరాలు వెల్లడించారు.
కడపలోని దండోరా కాలనీలో నివాసం వుంటున్న బాబు,సుజాతలకు కుమార్తె హారిక(22), మణికుమార్, అవినాష్ అనే కుమారులు వున్నారు. హారిక రాజంపేట లోని అన్నమాచార్య కాలేజీ లో బీటెక్ చదివేది. ఆ అమ్మాయి ఇంటర్ నుంచి బాయ్ ఫ్రెండ్స్‌తో ఎక్కువగా ఫోన్‌లో మాట్లాడుతూ చదువును నిర్లక్ష్యం చేయడంతో ఆమె తండ్రి చెవిటివాండ్ల బాబు ఈ నెల 3వ తేదీన రోకలితో కొట్టి చంపి చేతులకు మెడకు చున్నితో చుట్టి బెడ్ రూమ్ లో పడవేసి, ఆ తర్వాత నిందితుడు తల్లి ఓబులమ్మను వనిపెంట వద్ద నుంచి తీసుకొచ్చి, అదే రోజు రాత్రి సిద్ధవటం మండలం, మాచుపల్లె గ్రామ పొలాల వద్ద చంపేశాడు. తర్వాత మరదలు అయ్యవారమ్మ ను కొత్తపల్లె లో తన ఇంటి వద్ద పిల్లలతో ఉండగా అదే రోజు రాత్రి ఇంటిలోకి పోయి, ఆమెను కూడా చంపడానికి ప్రయత్నం చేశాడు. ఆమె కేకలు వేయడంతో, చుట్టు పక్కల వారు రాగా, నిందితుడు అక్కడ నుండి పారిపోయాడు.
హత్య చేయడానికి కారణాలివే..
హారిక తాను ప్రేమించిన యువకుడితో ఫోన్‌న్‌లో మాట్లాడటం, అతడిని ఇంటికి పిలిపించుకోవడం చేసేది.చదువుపై శ్రద్ధ చూపక పరీక్షల్లో ఫెయిల్ అయినట్లు తెలిపారు. దీంతో నిందితుడు బాబు హారికను కాలేజీ మాన్పించి ఇంటి వద్దే ఉంచాడు. బాబు, అతని భార్య ఇద్దరూ పనుల నిమిత్తం బయటకు వెళ్లే సమయంలో హారికను ఇంట్లో ఉంచి బయట నుంచి తాళం వేసి వెళ్లేవారని తెలిపారు. హారికను చూసుకోవడానికి నిందితుడు తన తల్లి ఓబులమ్మను వనిపెంట నుంచి కడపకు పిలిపించి ఇంటి వద్ద ఉంచాడు. ఓబులమ్మ మనవరాలు హారికపై ఉన్న ప్రేమతో తన మొబైల్ ఫోన్‌న్‌ను ఆమెకు ఇస్తూ ఉండేదని, హారిక అబ్బాయిలతో మాట్లాడేదన్నారు. ఈ విషయం గమనించిన నిందితుడు బాబు ఆమెను మందలించాడు. అయినప్పటికీ హారిక, ఓబులమ్మ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని, హారిక తల్లిదండ్రుల మాటలను లెక్కచేయకుండా అబ్బాయిలతో ఫోన్‌న్‌లో మాట్లాడుతూనే ఉండేదని పేర్కొన్నారు. హారిక ప్రవర్తన కారణంగా వీధిలో తనకు అవమానం జరుగుతోందని నిందితుడు భావించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తనకు జరుగుతున్న అవమానం తొలగిపోవాలంటే కుమార్తె హారికను, హారికను సరిగా చూసుకోకుండా మొబైల్ ఫోన్ ఇస్తున్న తన తల్లి ఓబులమ్మను చంపాలని నిందితుడు నిర్ణయించుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈనెల ఇంట్లో ఎవరూ లేని సమయంలో హారికను పచ్చడి దంచే రోకలితో కొట్టి హత్య చేసినట్లు నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలిపారు. పింఛన్ కోసం వనిపెంటకు వెళ్లిన తన తల్లి ఓబులమ్మను హత్య చేయాలనే ఉద్దేశంతో నిందితుడు తన ద్విచక్రవాహనంలో (ఏపీ04ఏవై 4118) వనిపెంటకు వెళ్లాడన్నారు. ఓబులమ్మను బైక్‌లో ఎక్కించుకుని సిద్ధవటం మండలం, మాచుపల్లె గ్రామ పొలాల వద్దకు తీసుకెళ్లాడు.. అదే రోజు రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఓబులమ్మను హత్య చేసి అక్కడే పడవేసినట్లు నిందితుడు తెలిపినట్లు ఎస్పీ పేర్కొన్నారు. అనంతరం సిద్ధవటం మండలం, కొత్తపల్లెలో నివసిస్తున్న తన తమ్ముడు రఘునాథ్ భార్య అయ్యవారమ్మను హత్య చేయడానికి ఆమె ఇంటికి వెళ్లాడన్నారు. అయ్యవారమ్మ తన తమ్ముడు రఘునాథ్‌తో సక్రమంగా కాపురం చేయడం లేదనే కారణంతో ఆమెను హత్య చేయడానికి ప్రయత్నించినప్పటికీ, అదృష్టవశాత్తు తప్పించుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతోనే
నిందితుడు పట్టివేత..
ఈ కేసును కొత్తగా స్మార్ట్ పోలీసింగ్ లో భాగంగా ఏర్పాటు చేసిన ఆర్‌టీజీఎస్, సీసీటివి –360 అప్లికేషను ద్వారా ఛేదించారు. నిందితుడు బాబు తన బైక్‌లో ఈనెల 5వ తేదీన శ్రీకాళహస్తి ఏపీ సీడ్స్ వద్ద, అదే రోజు సాయంత్రం శ్రీకాళహస్తిలో తిరుపతి రోడ్డు,శ్రీకాళహస్తి రైల్వేస్టేషన్, మరుసటిరోజున చిత్తూరు జిల్లా నరహరిరావుపేట, గుడిపాల వద్ద ఆర్‌టిజిఎస్, సీసీటివి–360 అప్లికేషనులో పోలీస్ వారికి అలర్ట్ వచ్చింది.. దాన్ని ఛేదిస్తూ రిమ్స్‌పీఎస్, ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ సీఐలు యం.రాజ గోపాల్, వెంకటేశ్వర్లు, ఎస్‌ఐలు లక్ష్మీనారాయణ, శ్రీనివాసులు, చంద్ర మోహన్, హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, ప్రవీణ్, కానిస్టేబుల్ ప్రసాద్, సుబ్బరాయుడు, మహేష్ లు నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో కృషి చేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
నిందితుడి అరెస్ట్.. మూడు సెల్‌ఫోన్‌లు, మోటార్ సైకిల్ స్వాధీనం


